అప్రెంటీస్‌ జీవోలు దహనం

Feb 13,2024 23:22

ప్రజాశక్తి – వినుకొండ : ఉపాధ్యాయ నియామకాల్లో బానిస వ్యవస్థగా ఉన్న అప్రెంటిస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ అన్నారు. ఈ మేరకు జీవో ప్రతులను పట్టణంలోని ప్రధాన వీధుల్లో నాయకులు మంగళవారం దహనం చేశారు. ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ 1994లో ప్రవేశపెట్టిన అప్రెంటిస్‌ను 18 ఏళ్లపాటు పోరాడి 2012లో రద్దు చేయించామని గుర్తు చేశారు. 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ఐదేళ్లుగా డీఎస్సీని విడుదల చేయకుండా ఇప్పుడు 6,100 పోస్టులతోనే, అదికూడా అప్రెంటిస్‌ విధానంలో నోటిఫికేషన్‌ ఇవ్వడం నిరుద్యోగులను మోసగించడమేనన్నారు. తక్షణమే ప్రభుత్వం పున్ణ సమీక్షించుకుని 30 వేల ఖాళీల భర్తీకి అప్రెంటిస్‌ లేని డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి రవిబాబు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో రివర్స్‌ విధానాలు పరిపాటయ్యాయని, ఉపాధ్యాయుల పోస్టులు రద్దు చేస్తున్న జీవో 117ను వెంటనే తొలగించాలని కోరారు. నిరసనలో నాయకులు పి.ఎ. జిలాని, ఎం.పోలయ్య, పి.రమేష్‌బాబు, జి.నాగేంద్రుడు, ఇ.వెంకటరెడ్డి, డి.వి.లింగయ్య, డి.రవికుమార్‌, జి.రామారావు, బి.భీమ్లా, బి.భాస్కర్‌, వి.నాగేశ్వరరావు, జి.ప్రసాద్‌, బి.గోవింద్‌ నాయక్‌, సిహెచ్‌. తిరుపతిరెడ్డి, సిహెచ్‌.మల్లికార్జున, సూర్యప్రకాష్‌, కాలేషావలి, పి.ప్రకాశరావు పాల్గొన్నారు.

➡️