అభివృద్ధి చేస్తా: ఎంఎం కొండయ్య

ప్రజాశక్తి-చీరాల: చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంఎం కొండయ్యను శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు టిక్కెట్‌ కేటాయించటం పట్ల ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. టికెట్‌ సాధించడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. చీరాల నియోజకవర్గంలో టిడిపి టికెట్‌ కోసం ఎవరైతే ప్రయత్నం చేశారో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కలిసికట్టుగా పనిచేసి చీరాలలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. తనకు ప్రజలు పట్టంకట్టి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే చీరాలను ఒక టూరిజం పాయింట్‌గా తయారు చేస్తానని అన్నారు. చేనేతలను దృష్టిలో పెట్టుకొని వారికి ఆప్రియల్‌ పార్క్‌ పెట్టి చేనేతలకు ట్రైనింగ్‌ ఇచ్చి ప్రతి ఒక్కరూ పనిచేసేలా అవకాశం కల్పిస్తామన్నారు. రైతాంగానికి లిఫ్ట్‌ ఇరిగేషన్స్‌ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ పునరుద్ధరించి రైతాంగానికి న్యాయం చేస్తామని పలు హామీలు ఇచ్చారు. అభివృద్ధి రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలన్నారు. ప్రభుత్వ పథకాలు అందని ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించారు. తిరిగి సాయంత్రం పట్టణంలో పలు ప్రధాన దేవాలయాలలో ఆయన తనయుడు గౌరీ అమర్నాథ్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కొమ్మనబోయిన రజిని, సుబ్బలక్ష్మి, శ్రీనివాస్‌ తేజ, వంకా హరికృష్ణ, కౌతారపు జనార్దన్‌, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️