అర్జీలను సత్వరం పరిష్కరించాలి : జెసి

ప్రజాశక్తి-వాల్మీకిపురం ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరం పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, పరిష్కార సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా 1902కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఈ నెల 15 నుంచి జరగనున్న ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతి-మహిళా శక్తి అనే ప్రత్యేక పథకం ద్వారా జీవనోపాధికి సున్నా వడ్డీకే ఆటో రిక్షాలు అందిస్తోందన్నారు. ఈ పథకం కింద నలుగురుకి ఆటోలను అందించామన్నారు. కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఆర్‌డిఒ మురళి, డిఎల్‌పిఒ నాగరాజ, డిఎల్‌డిఒ లక్ష్మీపతి, మండల ప్రత్యేక అధికారి శివరామమూర్తి, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, ఎంపిడిఒ షబ్బీర్‌ అహ్మద్‌, తహశీల్దార్‌ ఫిరోజ్‌ ఖాన్‌, ఎస్‌ఐలు నాగేశ్వర రావు, కృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ ఉద్యోగులు, పోలీస్‌ సిబ్బంది, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

➡️