ఆడుదాం ఆంధ్రా విజయవంతానికి 2కె వాకథాన్‌

ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌, జెసి తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు :
గ్రామ స్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీయడానికి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం నిర్వహించిన ‘2కె వాకథాన్‌’ ర్యాలీని స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ నుండి సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, కమిషనర్‌ కీర్తి చేకూరితో కలసి కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ నుండి మార్కెట్‌ సెంటర్‌ వరకూ ర్యాలీ సాగింది. హిందూ కాలేజీ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ఆడుదాం ఆంధ్ర విజయవంతానికి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రా పోటీలు గ్రామ స్థాయి నుండి రాష్థ్ర స్థాయి వరకూ జరుగుతాయని, ఈనెల 26న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ పోటీలను గుంటూరు నుండి ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకూ సుమారు లక్ష 25 వేల మంది ఈ క్రీడల్లో పాల్గొనటానికి ముందుకు వచ్చారన్నారు. ర్యాలీలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు సజీలా, బాలవజ్రబాబు, డిప్యూటీ కలెక్టర్‌ కె.స్వాతి, డిఆర్‌ఒ కె.చంద్రశేఖరరావు, ఆర్డీవో పి.శ్రీఖర్‌ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
గుంటూరు నగరంలోని నల్లపాడులోని లయోల స్కూల్‌లో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈనెల 26న ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, ఎమ్మెల్యే మహహ్మద్‌ ముస్తఫా, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రజని మీడియాతో మాట్లాడుతూ సిఎం పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం గ్రామస్థాయి నుంచి క్రీడాకారుల టాలెంట్‌ను వెలికితీసి, రాష్ట్ర స్థాయి వరకు పోటీలకు తీసుకెళ్లటానికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ మరో నాలుగు నెలల్లో రానున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించటానికి అన్ని పార్టీలు ఒక వైపు, జగన్‌ ఒకవైపు అన్నట్లుగా ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రజల హృదయాల్లో జగన్‌ చోటు సంపాదించుకున్నాడని చెప్పారు. కలెక్టర్‌ మాట్లాడుతూ లయోల పబ్లిక్‌ స్కూల్‌ గ్రౌండ్‌ నుంచి ఉదయం 10 గంటలకు సిఎం జగన్మోహన్‌రెడ్డి ఆడుదాం ఆంధ్రా పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు బాలవజ్రబాబు, సజీలా, డీసీసీబి ఛైర్మన్‌ రతాంశెట్టి సీతారామాంజనేయులు, గుంటూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ, గుంటూరు పశ్చిమ మండల తహశీల్దార్‌ సాంబశివరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎవర్ని గెలిపించాలో ప్రజలు డిసైడ్‌ అయ్యారు : రజిని
చంద్రబాబుతో ఎంత మంది కలిసి వచ్చినా వైఎస్‌ జగన్‌ను ఏమీ చేయలేరని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైసిపిఏ అని మంత్రి విడుదల రజిని అన్నారు. ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఎవరు ఎవరిని తెచ్చుకున్నా గెలిచేది వైసిపినే అని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇస్తున్న భరోసాతో ఎవరికి మద్దతివ్వాలో ప్రజలు డిసైడ్‌ అయ్యారని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యత చూసి ప్రతి ఒక్కరు సీఎంను తమ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్నారని, టిడిపి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందని అన్నారు.

➡️