ఆత్మకూరులో సమాచార చట్టం పనిచేయదా..?

Feb 12,2024 21:42
ఫొటో : నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్న కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌రెడ్డి

ఫొటో : నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్న కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌రెడ్డి
ఆత్మకూరులో సమాచార చట్టం పనిచేయదా..?
– మున్సిపల్‌ ఎదుట వైసిపి రెబల్‌ కౌన్సిలర్‌ ‘సూరా’ వినూత్న నిరసన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ప్రజాధనం వినియోగంపై వివరాలు అడిగితే తగిన సమాధానం ఇవ్వలేదని, ఆత్మకూరులో సమాచార చట్టం పనిచేయదా అని 20వ వార్డు కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ముఖద్వారం వద్ద అడ్డంగా నేలపై పడుకొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2019-2020 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు మున్సిపల్‌ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు జమ ఖర్చులు, మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం గురించి, మున్సిపల్‌ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో వివరాలు తెలపాలన్నారు. నెల్లూరుపాలెం వద్ద ఏర్పాటు చేసిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విగ్రహానికి మున్సిపల్‌ నిధులు ఏమైనా ఖర్చు చేశారా వాటి వివరాలు తెలపాలని కోరారు. అలాగే నూతనంగా ఏర్పడ్డ మున్సిపల్‌ బస్టాండ్‌ మున్సిపల్‌ నిధులు ఏమైనా ఖర్చు పెట్టారా వాటి వివరాలు తెలపాలని అడిగారు. ఈ వివరాలను సమాచారం తెలపాలని అడిగినప్పటికీ సమాచారం తెలపకపోవడంతో సమాచార హక్కు చట్టం కింద మున్సిపల్‌ అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వివరాలు ఇవ్వకపోవడంతో కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసుకొని 70రోజుల కావస్తున్నా సమాచారం ఇవ్వకపోవడంతో, మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. తాను అడిగే సమాచారం ఇచ్చేవరకూ ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో స్పందించిన మున్సిపల్‌ కమిషనర్‌ సురా భాస్కర్‌ రెడ్డితో సమస్యను అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన కమిషనర్‌ తాను ఇటీవల కొత్తగా వచ్చానని, త్వరలో కావాల్సిన సమాచారం ఇస్తానని హామీనివ్వడంతో సురా భాస్కర్‌ నిరసన విరమించుకున్నారు.

➡️