ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం

Dec 18,2023 20:13

 ప్రజాశక్తి – పార్వతీపురం  :  వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ అవగాహన, నూతన ఫీచర్స్‌తో విడుదల చేసిన అరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాడేపల్లి నుండి ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌, స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి హాజరయ్యారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని రూ.25 లక్షలకు పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో 3257 చికిత్సలను 2309 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పొందవచ్చని చెప్పారు. హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు వంటి ఇతర రాష్ట్రాల్లోని 136 కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సైతం వైద్యం పొందవచ్చని ఆయన చెప్పారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ పథకం గూర్చి తెలియజేయాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష జనవరి 1 నుంచి రెండవ దశ ప్రారంభమవుతుం దన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం వైద్య శిబిరాలు జరుగుతాయని, పట్టణ ప్రాంతాల్లో బుధవారం జరుగుతాయని చెప్పారు. వీటిపై సరైన పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సందర్భంగా కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ బి.వాగ్దేవి, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయ అధికారి కొయ్యాన అప్పారావు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.సాలూరు : డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద పొందే వైద్య చికిత్సల ఖర్చు పరిమితిని రూ.25లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి కోరారు. సోమవారం సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు పి.మధుసూధనరావు, పప్పల లక్ష్మణరావు, కమిషనర్‌ టి.జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇంతవరకు అందిన వైద్య సేవలు, వాటికోసం ఖర్చు చేసిన నిధుల గురించి వివరించారు.రాష్ట్రంలోని పేదలందరికీ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం అందించడమే లక్ష్యంగా పరిమితిని రూ.25లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.

➡️