ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిరసన

Dec 30,2023 22:34
ఫొటో : నిరసన వ్యక్త చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు

ఫొటో : నిరసన వ్యక్త చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు
ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిరసన
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు, హెల్పర్లు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పిడి కార్యాలయం నుండి మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి నివాసానికి వెళ్తున్న సిఐటియు నాయకులను అంగన్‌వాడీ వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ శనివారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్లు, ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కె.రఘురామమ్మ, వి.కామేశ్వరి మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె శనివారం 19వ రోజుకు చేరిందన్నారు. అంగన్‌వాడీలను, సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ జీపుల్లో ఎక్కించడంతో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు జీపులకు అడ్డుపడి కద్దులనీయకుండా తీవ్రంగా ప్రతిఘటించారు. దాంతో పోలీసులు మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చివేయడంతో అనేకమంది మహిళలు గాయాల పాలయ్యారన్నారు. ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తమను ఇలా ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వాలు ఏవీ కూడా అధికారంలో లేవని సిఎం జగన్‌ ఇది గుర్తించుకోవాలని హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ఇలాంటి సంఘటనలకు బెదిరేది లేదని ఇంకా తమ ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య, టి.మాల్యాద్రి, తుమ్మల వెంకయ్య, నరహరి, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

➡️