ఆశాలపై పోలీసుల నిర్భంధం

Dec 15,2023 20:50

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌  :  దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో పార్వతీపురం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట 36 గంటల నిరవధిక దీక్ష, వంటా వార్పూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి అందించేందుకు వెళుతున్న, ఆశా వర్కర్లను, సిఐటియు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని సీతానగరం పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. ఈ సంఘటనలో పోలీసుల తీరుపై సిఐటియు, ఆశావర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై పోలీసుల దౌర్జన్యం ఏమిటని ప్రశ్నించారు. కనీస వేతనాలు చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, ఆశ వర్కర్ల నియామకాల్లో రాజకీయ జోక్యం తొలగించి ప్రభుత్వమే నియామకాలను చేపట్టాలని కోరుతూ ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ఉదయం నుండి శుక్రవారం వరకు 36 గంటల పాటు మన్యం జిల్లా కలెక్టర్‌ ఎదుట పెద్ద ఎత్తున హాజరైన ఆశా వర్కర్లంతా నిరవధిక నిరసన దీక్షను చేపట్టారు. రాత్రంతా చలికి, నిద్రకు లెక్కచేయకుండా ఏకతాటిపై నిలిచి, శిబిరంలోని వంటావార్పు చేసుకుని శుక్రవారం మధ్యాహ్నం విజయం వంతంగా కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలంతా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రాంగణానికి చేరుకుని కలెక్టర్‌కు వినతి అందించేందుకు నాయకులు లోపలికి వెళ్తుండగా డిఎస్‌పి మురళీధర్‌ ఆధ్వర్యంలో పోలీసులు గేటు వద్ద అడ్డుకున్నారు. అధికారులు వచ్చి వినతి పత్రం స్వీకరించాలని నాయకులు కోరగా, కలెక్టర్‌ కార్యాలయంలో లేరని, జెసి మీటింగ్‌లో ఉన్నందు వేచి ఉండాలని పోలీసులు చెప్పారు. ఎంతసేపటికి అధికారులు రాకపోవడంతో తామే అధికారుల దగ్గరికి వెళ్తామని, అనుమతించాలని పోలీసులను సిఐటియు నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నందుకు నిరసనగా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు ఆశా వర్కర్స్‌ యూనియన్‌, సిఐటియు నాయకులపై ఒక్కసారిగా విరుచుకుపడి బలవంతంగా వారిని వాహనా లపై స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సిఐటియు నాయకులు వి.ఇందిర, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, ఉమామహేశ్వర రావు, పలువురు ఆశా కార్యకర్తలు ఉన్నారు. విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న సిపిఎం నాయకులు రెడ్డి వేణు వినతిపత్రం అందించడానికి అభ్యంతరం ఏముందని పోలీసులను ప్రశ్నించడంతో పరిమిత సంఖ్యలో ఆశావర్కర్లను కలెక్టరేట్‌లోకి అనుమతించారు. అనంతరం జెసి గోవిందరావుకు సమస్యలపై వినతి అందించారు.సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగిస్తాంతొలుత దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులలో తమ ప్రాణాలకు లెక్కచేయకుండా వైద్య సేవలు అందించిన ఆశా వర్కర్ల సేవలను గుర్తించి ప్రభుత్వం వారికి కనీస వేతనాలు చెల్లించాల్సింది పోయి, వారిచే పనికి సంబంధంలేని పనులు చేయించుకుంటూ అధికారులు సైతం వేధిస్తున్నారని అన్నారు. చాలీచాలని జీతాలతో కనీస గౌరవం లేని విధులను వారు నిర్వర్తించడం బాధాకరమని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ ఆశాలకు ప్రమాద, ఆరోగ్య బీమా బీమా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిరా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ను ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని, ఉదయం 9 నుండి సాయంత్రం 5గంటల వరకు విధిగా ఆసుపత్రిలోనే ఉండాలని నిబంధన పెట్టి వైద్య అధికారులు వేధింపులు ఆపాలని కోరారు. ఏకధాటిగా 36 గంటలు దీక్షలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్ఫూర్తితో ముందు ముందు మరింతగా ఉద్యమించేందుకు ఆశాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల నాయకులు ఎం.శివాని, టి.పద్మావతి, ఎలగాడ లక్ష్మి, వి.మాలతమ్మ, బి.పద్మ, ఎ.శారద, సిఐటియు కోశాధికారి జివి రమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘ పాకల సన్యాసిరావు, సిఐటియు నాయకులు సంచాన ఉమామహేశ్వరరావు బి సూరిబాబుతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి వచ్చిన ఆశా కార్యకర్తలు, సిహెచ్‌డబ్ల్యూఒ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం : డిఎంహెచ్‌ఒదీర్ఘకాలంగా ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహించిన 36 గంటల దీక్షకు అధికారులు స్పందించారు. సమస్యలపై దీక్ష అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావును కలిసి వినతి అందించారు. దీనికి జెసి స్పందించిన ఆయన జిల్లా వైద్యాధికారికి సమస్యపై స్పందించాలని కోరగా, ఆయన దీక్షా శిబిరానికి చేరుకున్న ఆయన ఆశా వర్కర్లకు హామీని ఇస్తూ మీ సమస్యలను పరిష్కరించేలా ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

➡️