‘ఆశా’లపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు : సిఐటియు

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌ ఆశా వర్కర్లుతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించడంలో, కనీస వేతనాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ నజీర్‌ అహ్మదుకు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు విజరుకుమార్‌ మాట్లాడుతూ చాలా ఏళ్లుగా ఆశా వర్కర్లుగా పని చేస్తున్న తమకు సరైన గుర్తింపు లేదని, ఉద్యోగ భద్రత కరువైందని పేర్కొన్నారు. అన్ని రకాల పనులు ఆశా వర్కర్లుతో చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రూ. 10లక్షల గ్రూప్‌ ఇన్సురెన్స్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్‌, మెటర్నిటీ లీవ్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ. 5 లక్షలు, పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరణించిన వారి కుటుంబంలో అర్హులైన వారికి ఆశాలుగా తీసుకోవాలన్నారు. ఎఎన్‌ఎం, హెల్త్‌ సెక్రటరీల నియామకాలలో ఆశాలకు వెయిటేజీ ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత,కనీస వేతనాలు అమలు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఆశా వర్కర్లు కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలన్నారు.మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ముంతాజ్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ కౌసల్య, రమాదేవి,మల్లేశ్వరి, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఓబులేసు పాల్గొన్నారు.

➡️