ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి : సిఐటియు

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) ఆశా వర్కర్లకు రూ.26 వేల వేతనాలు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, విజరుకుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ధర్నా చేశారు. వారికి మద్దతు తెలియజేస్తూ నాయకులు మాట్లాడారు. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుందని, వాస్తవానికి వారికి కేవలం రూ.6500 మాత్రమే వేతనాలు ఇస్తున్నారన్నారని చెప్పారు. రూ.3500 పని చేసే క్రమంలో కేసులకు ఇస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్‌ ప్రకారం రూ.26 వేల వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆశాలకు సంక్షేమ పథకాలు కూడా రద్దు చేసి, పనిభారాన్ని పెంచారని వాపోయారు. ఉదయం 8 గంటలకు విధులకు వస్తే సాయంత్రం 5 వరకు పని చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశా వర్కర్లపై విపరీతమైన వేధింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు ఎవరైనా భర్త చనిపోయి విడో ఉంటే వారికి వితంతు పెన్షన్‌ రాకుండా ఆపుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సాల్మన్‌, చంటి,మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ముంతాజ్‌, భానుమతి,ఆశా వర్కర్స్‌ యూనియన్‌ కౌసల్య, రమాదేవి, సువర్మ,ల్లేశ్వరి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️