ఆశా వర్కర్లతో గొడ్డు చాకిరీ

గుంటూరులో మాట్లాడుతున్న ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి
ప్రజాశక్తి-గుంటూరు :
చాకిరి బారెడు, జీతం మూరెడు అన్న చందంగా ఆశాల పరిస్థితి ఉందని ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి అన్నారు. ఆశా వర్కర్ల 36 గంటల నిరసన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం నిర్వహించిన ధర్నాలో ఆమె ప్రసంగించారు. ఈ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదన్నారు. 14 రకాల యాప్స్‌, 26 కరాల రికార్డులతో పని చేయాలని చెబుతు న్నారని, మరోవైపు గర్భిణులు సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, 24 గంటలూ అందుబాటులో ఉండాలని అంటున్నారని అన్నారు. గర్భిణుల సంక్షేమంతోపాటు అదనంగా రకరకాల సర్వేలు చేయిస్తున్నారన్నారు. కనీసం మహిళలని కూడా చూడకుండా వారాంతపు సెలవులు, మెటర్నిటీ లీవులు లేకుండా గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. రూ.4 వేలు పెంచి, రూ.10 వేలు పెంచినట్లు అబద్దపు ప్రచారం చేస్తోందన్నారు. ఏదైనా అత్యవసరం వస్తే గంట పర్మిషన్‌ కోసం కూడా అధికారుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. ఆశాలు మానసిక ఒత్తిడితో అనారోగ్యం బారిన పడుతున్నారని, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన ఆశాల కృషి ప్రభుత్వానికి గుర్తు లేదా అని ప్రశ్నించారు. అటువంటి వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం తగదన్నారు. సమస్యలు పరిష్కరిం చకుంటే రానున్న కాలంలో ఆందోళన ఉధృతం చేస్తామ న్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఆశాల పట్ల మానత్వం లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. గర్భం వచ్చినా, పిల్లల్ని పెంచాలన్నా సెలవులు లేవన్నారు. పోరాడి సాధించుకున్న మెటర్నిటీ లీవును ఆశాలకు మాత్రం వర్తింప చేయట్లేదన్నారు. కనీస వేతనాలు గానీ, సంక్షేమ పథకాలు గానీ ఇవ్వట్లేదన్నారు. సమస్యలు పరిష్కరించపోతే ఆశాలు ఐక్యం అవుతారని, ప్రభుత్వానికి తగిన గుణపాఠ చెబుతారని హెచ్చరించారు. యూనియన్‌ జిల్లా గౌరవా ధ్యక్షులు వై.నేతాజి మాట్లాడుతూ సమస్యలు పరిష్కార మయ్యే వరకూ ఆశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపుని చ్చారు. ఆశాలకు సిఐటియు అండగా ఉంటుందని చెప్పారు. ధర్నాకు ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షులు ఎ.అరుణ్‌ పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం డిఎంహెచ్‌ఒ ఆఫీసు ప్రాంగణంలో భైటాయించి నిరసన తెలిపారు. అధికారులు అందుబాటులో లేకపోవటంతో, శనివారం చర్చలకు యూనియన్‌ నాయకులను డిఎంహెచ్‌ఒ ఆహ్వానించినట్లు నాయకులు తెలిపారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.లక్ష్మీ అధ్యక్షతన జరిగిన నిరసనలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి జ్యోతి, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ధనలక్ష్మీ, కోశాధికారి లక్ష్మీ ప్రసంగించారు.

➡️