ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Mar 1,2024 23:52

గుంటూరులో పరీక్షకు వెళుతున్న విద్యార్థులు

నరసరావుపేటలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న జెసి శ్యాంప్రసాద్‌
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తెలుగు పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి 32,498 మంది హాజరు కావాల్సి ఉండగా, 31,718 (97.5 శాతం) మంది హాజరయ్యారు. 780 మంది గైర్హాజరయ్యారు. వీరిలో 1078 మంది ఒకేషనల్‌ విద్యార్థులకుగాను 125 మంది గైర్హాజరయ్యారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు, మాల్‌ప్రాక్టీసులు కేసులు నమోదు కాలేదని ఆర్‌ఐఒ జి.కె.జుబేర్‌ తెలిపారు. గుంటూరులోని ఏసీ కాలేజీలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సందర్శించారు. అనంతరం ఇంటర్‌ ఆర్‌ఐఒ కార్యాలయంలో పరీక్షా కేంద్రాలతో అనుసంధానం చేసిన లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా పలు కాలేజీల్లో పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ఫ్లైయ్యింగ్‌ స్క్వాడ్‌లు పలు కేంద్రాలను సందర్శించాయి. ఎస్‌.ఆర్‌.కాలేజి, చైతన్య కాలేజీలను ఆర్‌ఐఒ పరిశీలించారు. శనివారం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలుగు పరీక్ష నిర్వహిస్తారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 15618 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 14912 మంది (95.48 శాతం) హాజరయ్యారు. 706 మంది గైర్హాజరైనట్లు పల్నాడు జిల్లా ఓకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అధికారి ఎం.నీలవతిదేవి తెలిపారు. పరీక్ష కేంద్రాలను పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాదు సందర్శించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని రామిరెడ్డిపేటలోని వికాస్‌ జూనియ కళాశాల, రావిపాడులోని ఆక్స్‌ఫర్డ్‌ జూనియర్‌ కళాశాలలో కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్‌ విధించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్‌ సెంటర్లు మూసివేయించారు. పరీక్షా సమయంలో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చూస్తున్నారు.

➡️