ఇంధనాల వినియోగంపై బాధ్యత అవసరం

ఇంధనాల వినియోగంపై బాధ్యత అవసరం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడంపై వినియోగదారుల్లో, గృహాల్లో, పరిశ్రమల్లో, వ్యాపార సముదాయాల్లో యువతకు అవగాహన కల్పించాల్సి ఉందని జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో ఈ నెల 14 నుంచి 20 వరకూ నిర్వహించనున్న జాతీయ విద్యుత్‌ పొదుపు వారోత్సవాలను గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ విద్యుత్‌ వినియోగంలో పొదుపు చర్యలు తప్పనిసరిగా పాటించాలని, తద్వారా భవిష్యత్‌ తరాలకు బొగ్గు, గ్యాస్‌, క్రూడాయిల్‌ వంటి శిలాజ ఇంధనాలు వినియోగం తగ్గించి రేపటి తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన విద్యుత్‌ సరఫరా చేసేందకు ఇంధన వనరుల మీద అత్యంత శ్రద్ధ కనబరుస్తోందని ఆమేరకు యువత, ముఖ్యంగా విద్యార్థులను ఇటువంటి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలన్నారు. విద్యుత్‌ వినియోగం బాగా పెరగడం వల్ల సహజ వనరుల పరిరక్షణ, గ్లోబల్‌ వార్మింగ్‌ను నియంత్రించేందుకు విద్యుత్‌ను పొదుపు చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. విద్యుత్‌ సరఫరా చేయడానికి, జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు విద్యుత్‌ పొదుపును అమలు చేయటానికి కంకణం కట్టుకుందన్నారు. మనందరం ఇందులో భాగస్వామ్యం అవుదామన్నారు. విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ టి.వి.ఎస్‌.ఎన్‌. మూర్తి, ఆర్‌డిఒ ఎ.చైత్రవర్షిణి, ఇఇలు బి.వీరభద్ర రావు, డి.శ్రీధరవర్మ, ఎన్‌.శ్యాముల్‌, డిఇ ఎస్‌.దేవయ్య, టి.గాబ్రియల్‌ పాల్గొన్నారు.

➡️