ఈసారీ గెలుపు కోడిదే…

Jan 16,2024 22:47
హైకోర్టు ఆదేశించినా...

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

హైకోర్టు ఆదేశించినా… పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా… షరామాములుగా ఈ ఏడాదీ ఖాకీపై కోడి పైచేయి సాధించింది. పండగ మూడు రోజులూ కోళ్లు కత్తులు దూయగా… రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఖాకీలు ప్రేక్షక పాత్ర పోషించారు. ఫలితంగా రూ.కోట్లు చేతులు మారాయి. సామాన్యులు జేబులు గుళ్లయ్యాయి.

పండుగ వారం రోజుల ముందు నుంచే పోలీసులు అవగాహనా సమావేశాలు నిర్వహించారు. కోడిపందేలు జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. పలువురిని బైండోవర్‌ చేశారు. ఆఖరి అస్త్రంగా మైక్‌ ద్వారా సైతం ప్రచారం చేయించారు. ఇవేమీ కోడి పందేలను ఆపలేకపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 500 బరుల్లో మూడు రోజుల పాటు కోడి పందేలతో పాటూ గుండాటలు, పేకాటలు జోరుగా సాగాయి. మొత్తంగా ఈ ఏడాది పండగ సీజన్లో దాదాపు రూ.500 కోట్లుపైనే సొమ్ములు చేతులు మారినట్లు అంచనా.కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ తిమ్మాపురంలో భారీ స్థాయిలో పందేలు జరిగాయి. పండుగ మూడు రోజులు ఇక్కడ హైటెక్‌ హంగులు కనిపించించాయి. స్థానిక ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు ప్రోద్భలంతో ఆయన అనుచరులు భారీ ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్‌ కు పెద్ద ఖాళీ స్థలం కూడా ఏర్పాటు చేశారంటే ఎంత స్థాయిలో పందేలు, జూదాలు జరిగాయో అర్ధం అవుతుంది. వీఐపీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. రోజుకు 40 పందేల చొప్పున నిర్వహిస్తున్నారు. ఒక్కో పందేం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఉందని సమాచారం. అలాగే వాకలపూడి, వలసపాకల, సర్పవరం, కొవ్వూరు, తూరంగి గ్రామాల్లోనూ పందెం శిబిరాలను నిర్వహించారు. కరప, పిఠాపురం, గొల్లప్రోలు, తాళ్లరేవు, తుని, కోట నందూరు, జగ్గంపేట, గండేపల్లి ఇలా అన్ని మండలాల్లో పందేలు జోరుగా జరిగాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో అధికార పార్టీ నేతలు ఈ సారి సంక్రాంతి సంబరాల పేరుతో జూదాలు గట్టిగానే నిర్వహించారు. అనుచరులు, కార్యకర్తలను దష్టిలో పెట్టుకుని బరులు వద్ద వేలం పాటలు నిర్వహించి సొమ్ములు చేసుకున్నారు. అటు కోనసీమ వ్యాప్తంగా పందేలు విచ్ఛలవిడిగా జరిపారు. రాజోలు, అల్లవరం అమలాపురం, మల్కిపురం, మామిడికుదురు, కాట్రేనికోన, రావులపాలెం, ఆత్రేయపురం తదితర మండలాల్లో జరిగిన పందేల్లో మగ వారితో బాటు మహిళలు కూడా ఉత్సహంగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, ధవలేశ్వరం, కొవ్వూరు, కడియం, తాళ్లపూడి, నిడదవోలు, గోపాలపురం, దేవరపల్లి, పెరవలి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. విఐపి గ్యాలరీలు సైతం ఏర్పాటు చేశారు. ఇక్కడ పందేలు చూడడానికి ఇతర జిల్లాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. మరోవైపు నిబంధనలను పక్కన పెట్టి ఎక్కడికక్కడ మద్యం విక్రయాలు కూడా ఎక్కువ చోట్ల జరిగాయి. ఏర్పాటు చేసిన బరులు ద్వారా రూ.కోట్లు సొమ్ములు చేతులు మారినట్లు సమాచారం. పండగ మూడు రోజుల్లో వేలాదిమంది ఈ పందేలు,జూదాల్లో ఉత్సహంగా పాల్గొన్నారు.లక్షలాది రూపాయలకు వేలంపాట పాడుకొని మరీ పందెం రాయుళ్లు బరితెగించారు. గుండాట నిర్వహణ ద్వారా ఎక్కువ మొత్తంలో సొమ్ములు చేతులు మారాయని ఒక అంచనా.కొట్లాటలు, పోలీసులు దాడులుకొన్ని చోట్ల బరులు వద్ద కోట్లాటలు జరిగాయి. పిఠాపురం మండలం ఎఫ్‌.కె.పాలెంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ వివాదంలో నలుగురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలో ఇద్దరి మధ్య జరిగిన కోట్లాటలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పలుచోట్ల పోలీసులు దాడులు చేపసి బరులను ధ్వంసం చేశారు. కాకినాడ సబ్‌ డివిజన్‌ తిమ్మాపురం మండల గ్రామాలైన నేమాం , పండూరు, పరకాలువలలో, కరప మండలం విజయారాయుడుపాలెం, పిఠాపురం మండలం ఎఫ్‌.కే.పాలెం, గొల్లప్రోలు మండలం వన్నేపూడి, చెందుర్తి గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలను ధ్వంసం చేసారు. పెద్దాపురం సబ్‌ డివిజన్‌ లోని గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట , ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామాలలో బరుల శిబిరాలను ప్రత్యేక పోలీసు బందాలు నిర్వీర్యం చేశారు.లెక్కచేయని హెచ్చరికలుపోలీసులు,జిల్లా కలెక్టర్‌ హెచ్చరికలను లెక్కచేయకుండా పందెం రాయుళ్లు తమ పని కానించారు.ఒక్కో బరి వద్ద వందల సంఖ్యలో గుమిగూడి పందేలు,జూదాల్లో పాల్గొన్నారు.కొన్ని చోట్ల జూదాలను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించనా రాజకీయ ఒత్తిళ్ళతో వెనుదిరగారు.సామాన్యుల జేబులు గుల్లసంక్రాంతి పండగ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం తమ జేబులను గుల్ల చేసుకున్నారు.ఆయా శిబిరాల వద్ద గుండాట, పేకాటల వద్ద పోటీపడి మరీ జూదాల్లో పాల్గొన్నారు.వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని జూదాల నిర్వాహకులు రేయింబవళ్లు ఆటలు కొనసాగించారు.కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పలువురు ఈ పండగ పుణ్యాన జేబులు ఖాళీ చేసుకున్నారు.

రౌతులపూడి సంక్రాంతి ముసుగులో మండల వ్యాప్తంగా కోడిపందాలు. గుండాట జోరుగా సాగాయి సంక్రాంతి ముందు నుంచి కోడిపందాలు నిషేధమని ప్రచారం నిర్వహించిన పోలీసులు మూడు రోజులుగా గ్రామాల్లో విచ్చలవిడిగా కోడిపందాలు, గుండాట జరిగినప్పటికీ చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. జూదంలో సొమ్ములు పోగొట్టుకున్న జూదరులు నిరాశకు గురయ్యారు. మూడు రోజులుగా జరిపిన జుదాల్లో లక్షరాది రూపాయలు చేతులు మారాయి.

సామర్లకోట రూరల్‌ మండలం లోని అచ్చంపేట, పనసపాడు గ్రామాలతోపాటు వేట్లపాలెం, మాధవపట్టణం, వికె రాయపురం, జి.మేడపాడు గ్రామాల్లోనూ కోడిపందాలు, గుండాటలు యథేచ్ఛగా సాగాయి. ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు సైతం ఈ క్రీడల్లో కుటుంబాల సమేతంగా పాల్గొని కోడి పందాలను వీక్షించారు. ఇలా ఉండగా ఈ ఏడాది కోడి పందాలు ఎంతో పట్టుదలతో పేరుకోసం నిర్వహిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి కోడి పుంజులను డబ్బులిచ్చి రప్పించి మరీ పందాలు నిర్వహించడం విశేషం.

➡️