యశోద హాస్పిటల్‌లో అరుదైన ఆపరేషన్‌

ప్రజాశక్తి-ఒంగోలు: మేజర్‌ యాక్సిడెంట్‌లో కాలు పూర్తిగా నుజ్జునుజ్జయి తీసి వేయాల్సిన ఆ కాలును నాలుగు మేజర్‌ సర్జరీలు నిర్వహించి కాలు పోకుండా తమ వైద్య ప్రతిభను చూపినట్లు హైదరాబాద్‌ సోమాజీగూడ యశోద హాస్పిటల్‌ ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ శశికాంత్‌ మద్దు తెలిపారు. శుక్రవారం ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి అరుదైన కేసులను ఛాలెంజ్‌గా తీసుకొని తాము చేసిన ప్రయత్నానికి ఈరోజు ఆ వ్యక్తి నడవటం తమ విజయానికి గర్వంగా ఉందని తెలిపారు. ఒంగోలుకు చెందిన కొంగలేటి వెస్లీ అనే వ్యక్తి దొనకొండ దగ్గర యాక్సిడెంట్‌కు గురయ్యారు. కాలు నుజ్జు నుజ్జయింది. ఆ వ్యక్తి గుంటూరులోని ఒక ప్రముఖ వైద్యశాలకు వెళ్లడంతో కాలు తీసివేయాలని చెప్పినట్లుగా తెలిసింది. అతనికి కాలు తీసివేయడానికి ఇష్టపడక ఆధునిక వైద్యం కోసం హైదరాబాదులోని యశోద ఆసుపత్రి సొమాజిగూడ బ్రాంచికి చేరుకొని సంప్రదించారు. అది కరోనా సమయం అవడం వలన వైద్యం అందుతుందో లేదో అని భయపడుతూ యుశోద ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఆ రాత్రిపూట ఆ వ్యక్తిని పరిశీలించిన వైద్యులు డాక్టర్‌ శశికాంత్‌ మద్దు, డాక్టర్‌ సునీల్‌ దాచేపల్లి, ఇద్దరూ ఆ వ్యక్తికి మైక్రో సర్జరీ చేసి ఆధునిక వైద్య పరికరాలతో కాలు తీసేయకుండా కాపాడారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. నుజ్జునుజ్జయిన కాలును తీసివేయకుండా ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ శశికాంత్‌ మద్దు, మరియు ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సునీల్‌ దాచేపల్లి స్వయంగా ఆ కాలుకు సంబంధించి మొత్తం నాలుగు సర్జరీలు నిర్వహించి విజయవంతంగా అతనికి కాలు పోకుండా అందరిలాగా నడిచే విధంగా కృషి చేశారు. యశోద హాస్పిటల్‌ వైద్యులు ఆధునిక వైద్య పరికరాలతో అత్యాధునిక వైద్యం అందించి మరింత మందికి భరోసాగా నిలిచారని వారన్నారు.

➡️