ప్రతిపాదనలకే జింకల పార్కు

Jun 29,2024 01:20 #Deer park, #proposals

– ఏటా వేల ఎకరాలు నష్టపోతున్న రైతులు
– గతంలో ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చాలి
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి :వరుణుడిపై భారం వేసి ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు విత్తనాలు నాటారు. పొలంలో పొడుచుకొచ్చిన మొలకలు చూసి మురిసిపోయారు. సకాలంలో చినుకులు రాలుతుంటే చిరునవ్వులు చిందించారు. ఎదుగుతున్న పంటలను జింకలు మేసేయడంతో లబోదిబోమంటున్నారు. ఇదీ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంతో పాటు పరిసర మండలాల్లోని రైతుల పరిస్థితి. ఖరీఫ్‌ సీజన్‌లో అత్యధికంగా పత్తి, వేరుశనగ, మొక్కజన్న, కంది పంటలను అన్నదాతలు సాగు చేశారు. ప్రస్తుతం విత్తనాలను, మొలకలు వచ్చిన, చిగురించిన పంటలను జింకలు తినేస్తున్నాయి.
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, ఆలూరు, ఆస్పరి, పత్తికొండ, దేవనకొండ, తుగ్గలి, హాలహర్వి, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల, గూడూరు, కల్లూరు, ఓర్వకల్లు, మిడుతూరు మండలాల పరిధిలోని వేల ఎకరాల్లో పంటలు జింకల దాడిలో దెబ్బతింటున్నాయి. గతేడాది ఖరీఫ్‌లో 25 వేల ఎకరాలకు పైగా పంటలను నాశనం చేసినట్లు అంచనా. సుమారుగా రూ. వంద కోట్ల మేర అన్నదాతలకు నష్టం వాటిల్లింది. ప్రతి ఏడాది ఇదే తంతు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో నల్లరేగడి పొలాలు విశాలంగా ఉండడంతో జింకల సంచారం ఎక్కువగా ఉంది. ఒక్కో మందకు 15 నుంచి 20 జింకలు సంచరిస్తూ పొలాల్లో తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారుల సర్వేలో తొమ్మిది వేలకు పైగా జింకలున్నట్లు గుర్తించారు.
2014లో కర్నూలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జింకల పార్కు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ తరువాత ఏడాది ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల పరిధిలోని దేవరగట్టు ప్రాంతంలో జింకల పార్కు ఏర్పాటుకు 250 ఎకరాల భూమిని సర్వే చేశారు. దీనికోసం గతంలో రూ.53.26 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. అటవీశాఖ అధికారులు తుంగభద్ర రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలోని 35, 36, 37 బీట్‌ కంపార్ట్‌మెంట్‌లో 12 అడుగుల ఎత్తులో కంచె వేయాలని నిర్ణయించారు. దీనికోసం రూ.29.65 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అలా కాకుండా పార్కు ఏర్పాటు చేస్తే రూ.14.72 కోట్లు అవుతుందని, ఐదేళ్లపాటు జింకల నిర్వహణకు రూ.29.65 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం జింకల పార్కుపై దృష్టి సారించలేదు. అప్పటి కార్మిక శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం కూడా పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా ఆచరణకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఇప్పుడైనా జింకల పార్కు ఏర్పాటు చేసి రైతుల పొలాలు జింకల బారిన పడకుండా కాపాడాలని రైతులు కోరుతున్నారు.
రూ.30 వేల వరకూ నష్టం
గత ఏడాది రెండెకరాల్లో పత్తి పంట వేసాను. విత్తనం వేసినప్పటి నుంచి కాపు వచ్చేంత వరకు జింకల బెడద నుండి కాపాడుకునేందుకు రాత్రి, పగలు కాపలా కాశాం. అయినా జింకలు గుంపులుగా వచ్చి పంటను తిని నాశనం చేశాయి. ఎకరాకు రూ.60వేల వరకూ పెట్టుబడి పెట్టాను. జింకలు పంటను తినేయడం వల్ల రూ.30వేల వరకూ నష్టం వచ్చింది.
– మహాదేవ, మనేకుర్తి, ఆలూరు మండలం.
తగిన చర్యలు చేపట్టాలి
ప్రభుత్వం, జిల్లా అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని రైతుల పంట పొలాలను కాపాడాలి. అనేకసార్లు జిల్లా అధికార యంత్రాంగానికి వినతి పత్రాలు ఇచ్చాం. ఆందోళనలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఏమాత్రం ఫలితం లేదు.గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీని ఇప్పుడైనా నెరవేర్చాలి. జింకల బారి నుంచి రైతాంగాన్ని ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలి.
– జి.రామకృష్ణ, రైతు సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శి

పరిహారం అందించేందుకు చర్యలు
గతంలో జింకల పార్క్‌కు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం తుంగభద్ర ప్రాంతంలో జింకలు తినేందుకు ప్రత్యేకంగా పంటలు పండిస్తున్నాం. జింకల వల్ల పంటలు నష్టపోయిన రైతులు… మండల వ్యవసాయ అధికారి ద్వారా పంట నష్టపోయినట్లు ధృవీకరణ పత్రం తీసుకుని, దానిని తమకు అందజేస్తే ప్రభుత్వానికి పంపి అటవీ శాఖ ద్వారా పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.
తేజస్విని, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి

➡️