ఈ పోరాటం చారిత్రాత్మకం

Jan 24,2024 00:36

నరసరావుపేటలో సమ్మె శిబిరం వద్ద విజయోత్సవ సభలో మాట్లాడుతున్న గుంటూరు విజరుకుమార్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె ఇన్ని రోజులు కొనసాగిస్తుందని ఎవరు ఊహించలేదని, ఇన్ని రోజులు అంగన్వాడీలు ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులను తట్టుకుని ఎంతో పట్టుదలతో పోరాడారని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ అభినందనలు తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని సమ్మె శిబిరం వద్ద మంగళవారం నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 42 రోజులపాటు కొనసాగిన సమ్మెకు అండగా ఉండి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన ప్రజాసంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో కృషి చేసిన మీడియా ప్రతినిధులకు అంగన్వాడీలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకున్నారు. విజయోత్సవ సభకు యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కెపి. మెటిల్డాదేవి అధ్యక్షత వహించగా విజరుకుమార్‌ మాట్లాడుతూ క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి రోజుల్లో లేని ఆనందం అంగన్వాడీలకు ఇప్పుడొచ్చిందని అన్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో హామీల అమలు, ఉద్యోగ భద్రత, మరింత మెరుగైన వేతనాల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కెపి మెటిల్డాదేవి, జి.మల్లీశ్వరి మాట్లాడుతూ పోరాటం వల్లే ప్రస్తుత విజయం సాధ్యమైందన్నారు. నిరవధిక దీక్షలకు కూర్చున్న యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ, అధ్యక్షులు బేబీ రాణితోపాటు అండగా నిలిచిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిఐటియు రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇచ్చిన హామీ మేరకు జూన్‌ నుండి వేతనాలు పెంపు తదితర డిమాండ్లపై అవసరమైతే ఆయా ప్రభుత్వాలను ఎదిరిస్తూ ఇదే తరహా ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, ప్రాజెక్టు లీడర్‌ బి.నిర్మల, డి.మాధవి, బివి రమణ,శోభారాణి, సిపిఎం పట్టణ కార్యదర్శి షేక్‌ సిలార్‌ మసూద్‌, కౌలురైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.రామారావు, ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా నాయకులు ఏడుకొండలు, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు కృష్ణ, సిపిఎం నాయకులు బి.నాగేశ్వరరావు, ఎమ్‌డి హుస్సేన్‌ పాల్గొన్నారు.

గుంటూరు సమ్మె శిబిరంలో విజయ చిహ్నం చూపుతున్న అంగన్వాడీలు

ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వంతో చర్చలు సఫలం కావటంతో అంగన్‌వాడీలు సమ్మె విరమించారు. ఈ మేరకు 23వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు విధుల్లో చేరుతున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీకి ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) నాయకులు, అంగన్‌వాడీలు మంగళవారం ఆ శాఖ కార్యాలయంలో కలిసి లేఖ అందచేశారు. తొలుత అంగన్‌వాడీలు కలెక్టరేట్‌ ఎదుట 42 రోజులపాటు సమ్మె కొనసాగిన శిబిరాన్ని సందర్శించి ఒకరికొకరు అభినందనలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజి మాట్లాడుతూ అనేక రకాల ఒత్తిళ్లను తట్టుకొని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాడిన అంగన్‌వాడీలకు అభినందనలు తెలిపారు. అంగన్‌వాడీల సమ్మెకు అండగా నిలిచిన రాజకీయ పక్షాలు, కార్మిక, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే జిఒల రూపంలో విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దీప్తి మనోజ, నగర గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాస్‌, నగర అధ్యక్ష, కార్యదర్శులు చిన్న వెంకాయమ్మ, టి.రాధ పాల్గొన్నారు.

➡️