ఎంపి స్థానాలపై వైసిపి కసరత్తు

శ్రీకృష్ణదేవరాయులుకు స్థాన చలనం?
పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే పేరు పరిశీలన
గుంటూరుకు అంబటి రాయుడు మొగ్గు
బాపట్లకు డొక్కాను ఎంపిక చేసే అవకాశం
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, నర్సరావుపేట లోక్‌సభ స్థానాలపై వైసిపి అధిష్టానం కసరత్తు చేస్తోంది. గుంటూరుకు ప్రముఖ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు పేరు ప్రచారంలో ఉండగా నర్సరావుపేటకు మరో అభ్యర్థిని అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నర్సరావుపేట ఎంపి కృష్ణదేవరాయులును మరో నియోజకవర్గానికి పంపాలని యోచిస్తున్నారు. ఇందుకు ఆయన అంగీకరించడం లేదని తెలిసింది. శ్రీ కృష్ణదేవరాయులు కేంద్ర ప్రభుత్వం నుంచి పలు ప్రాజెక్టులకు అనుమతి పొందారు. ఈ ప్రాజెక్టుల న్నింటినీ పూర్తి చేయాలంటే తాను మరో సారి నర్సరావుపేట ఎంపిగా కొనసాగాలని ఆయన భావిస్తున్నారు. గుంటూరు ఎంపి లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కృష్ణదేవరాయులుకు సిఎం జగన్‌ ఆఫర్‌ ఇచ్చారని ఇందుకు ఆయన అంగీకరించలేదని తెలిసింది. తాను పోటీ చేయడం అంటూ జరిగితే నర్సరావుపేటనుంచి చేస్తా..లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కృష్ణ దేవరాయులు చెప్పినట్టు సమాచారం. వైసిపిలో మారుతున్న సమీకరణల నేపధ్యంలో పల్నాడుజిల్లాలోని ఒక ఎమ్మెల్యేను ఎంపిగా పంపాలని వైసిపి అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. బుధవారం రాత్రి పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పార్టీ అగ్రనాయకులను కలవగా ఎంపిగా పోటీ చేయండి అని సూచించినట్టు తెలిసింది. దీంతో ఆయన కొంత సమయం ఇవ్వండి ఆలోచించి చెబుతానని అన్నట్టు సమాచారం. కృష్ణదేవరాయులకు ఎక్కడ అవకాశం కల్పిస్తారన్నదీ ఇంకా స్పష్టత రాలేదు. గుంటూరు ఎంపిగా కూడా గతంలో కొంతమంది పేర్లు పరిశీలించినా ఇటీవల పార్టీలో చేరిన అంబటి రాయుడు వైపు మొగ్గుచూపారు. బాపట్ల ఎంపి నందిగం సురేష్‌ను కూడా మరోచోటికి మారుస్తారని సమాచారం. ఆయన స్థానంలో మాజీమంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ పేరునుపరిశీలిస్తున్నట్టు తెలిసింది. నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే తనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని సిఎం జగన్‌ను కోరాలని డొక్కా ప్రయత్నిస్తున్నారు. గతకొంత కాలంగా సిఎం జగన్‌ అప్పాయింట్‌మెంట్‌ కోరుతున్నా ఇంకా అనుమతి రాలేదు. ఈనేపధ్యంలో ఇటీవల తాడికొండలో జరిగిన బస్సు యాత్రలో తనకు సిఎంతో అప్పాయింట్‌మెంట్‌ ఇప్పించాలని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్తలు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ను కోరారు. కానీ వారు ఇంతవరకు స్పందించలేదు. టిడిపి అభ్యర్థుల ప్రకటనకు ముందే వైసిపి ఎంపి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు.టిడిపి నుంచి గల్లా జయదేవ్‌ పోటీ చేస్తారా లేదా అన్న అంశం ఇంకా సంశయంగానేఉంది.ఆయన స్థానంలో మరో వ్యాపార వేత్తను ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. నర్సరావుపేట ఎంపిగా బిసికి ఇవ్వాలని గతంలో ఆలోచన చేసినా సామాజిక సమీకరణలో మరో బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్టు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

➡️