ఎన్‌ఎఒబిలో రెండో రోజు కొనసాగిన ఎల్‌ అండ్‌ టి కార్మికుల సమ్మె

తహశీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఎన్‌ఎఒబిలోని ఎల్‌ అండ్‌ టి కార్మికులు

ప్రజాశక్తి-రాంబిల్లి

కనీస వేతనం, పిఎఫ్‌, బోనస్‌, ఓటి ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఎఒబిలోని ఎల్‌ అండ్‌ టి కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా తహశీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన, రహదారిపై రాస్తారోకో చేశారు. యాజమాన్యం ముందు ఉంచిన 8 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌తో ఎల్‌ అండ్‌ టి యాజమాన్య ప్రతినిధులు సాయిరామ్‌, వీరేష్‌, స్థానిక సీఐ లక్ష్మణరావు, దిశా సీఐ దీనబంధు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు జి.దేవుడునాయుడు, విశాఖ జిల్లా నాయకులు వై.రాజు, ఎల్‌ అండ్‌ టి కార్మికుల బృందం విశాఖపట్నం లేబర్‌ కమిషనర్‌ సెంట్రల్‌ ఆఫీస్‌లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మిగిలిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో సమస్యలపై కంప్లైంట్‌ చేస్తే, వాటిని చట్ట ప్రకారం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్‌ డిఫెన్స్‌ రంగం కనుక ఆందోళనలు విరమించి, విధులకు హాజరు కావాలని సూచించారు. దీనిపై యూనియన్‌ ప్రతినిధులు కార్మికులతో ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఎన్‌ఎఒబికి వద్ద కార్మికులతో మాట్లాడగా, ఎల్‌ అండ్‌ టి యాజమాన్యం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, యాజమాన్యం రాతపూర్వకంగా ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.

➡️