ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

ప్రజాశక్తి -కనిగిరి : సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. కనిగిరి పట్టణంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాలు వద్ద ఉన్న మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్‌హాల్‌ ను ప్రారంభించారు. రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కొండపి : ఎన్నికల కోడు రాలేదని అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవనిజిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ హెచ్చరించారు. తహశీల్దారు కార్యాలయంలోని ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ను గురువారం సందర్శించారు. అనంతరం నియోజకవర్గ స్థాయి నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ రాకపోయిన అధికారులు తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఎన్నికల కోడ్‌ ఎప్పుడైనా రావచ్చునని తెలిపారు. ఎంసిసి, ఎస్‌ఎస్‌టి,యుఎస్‌టి, ఎప్‌ఎస్‌టి, వివిటి, అకౌంట్స్‌, ఫిర్యాదులు, రిపోర్ట్సు, మేనేజ్మెంట్‌, టీమ్స్‌ నోడల్‌ అధికారులు నిర్వర్తించాల్సిన విధులపై సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు 16 విభాగాలకు సంబంధించి నోడల్‌ అధికారులను జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నియమించినట్లు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి ఎం.సిసి(మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌) అమల్లోకి వస్తుందని తెలిపారు. నోడల్‌ అధికారులు ఎన్నికల నియమావళిపై అవగాహన పెంచుకొని ఎన్నికల కోడ్‌ అమలులో వచ్చినప్పటి నుంచి తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. అనంతరం మండల పరిధిలోని గోగినేనివారిపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. రాజకీయ నాయకులతో సమావేశంవివిధ పార్టీ నాయకులతో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు కెజి.మస్తాన్‌ మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన వారి ఓట్లు జిగ్‌జాగ్‌గా ఉన్నాయని, వాటిని సరిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, అడిషనల్‌ ఎస్‌పి శ్రీధర్‌రావు, కొండపి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కుమార్‌, ఒంగోలు అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటి వైస్‌ చైర్మన్‌ విశ్వేశ్వరరావు, సెక్టార్‌ అధికారులు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. దర్శి : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టరు దినేష్‌కుమార్‌ తెలిపారు. తహశీల్దారు కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో ఎన్నికల నిమావళి, నిబంధనలపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల భద్రత, కౌంటింగ్‌ మిషన్లపై సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఎప్పడు ఎన్నికలు వచ్చినా అధికారులు సక్రమంగా నిర్వహించేదుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇఆర్‌ఒ లోకేశ్వరరావు, వివిధశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️