ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం

సమావేశంలో పాల్గొన్న సబ్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు

ప్రజాశక్తి-రంపచోడవరం

ఓటర్ల సవరణ ప్రక్రియ, మార్పులు చేర్పులు, ఎన్నికల ఏర్పాట్లు గురించి రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ యస్‌.ప్రశాంత్‌ కుమార్‌ శనివారం తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో 399 పోలింగ్‌ బూతులు ఉన్నాయని, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ బూతులలో సమస్యలు పరిష్కారం కొరకు అన్ని పోలింగ్‌ బూతులకు సెక్టార్‌ అధికారులను నియమించడం జరిగిందని చెప్పారు. ఈ నెల 17 నుండి 23వ తేదీ వరకు కొత్తగా ఫారం 6 ద్వారా ఓటర్ల నమోదు కొరకు 157 దరఖాస్తులు, ఫారం-7 ద్వారా చనిపోయిన వారి పేర్లు తొలగించుటకు 227 దరఖాస్తులు, ఫారం 8 ద్వారా ఓటర్‌ పేర్లలో తప్పులు ఫోటోలు సరిగ్గా లేనియెడల సరి చేయుటకు 222 దరఖాస్తులు రావడం జరిగిందని పేర్కొన్నారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షల 75 వేల 650 మంది ఓటర్లు ప్రస్తుతం ఉన్నారని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటర్‌ నమోదుకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముందు రోజు వరకు ఓటర్ల జాబితాలో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత ఫారముల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కె.బాలకృష్ణ, పి.శ్రీనివాసరావు, చుక్క సంతోష్‌ కుమార్‌, యం.వాణిశ్రీ, సిద్ధ వెంకన్నబాబు, పి.అనంత మోహన్‌, తహసీల్దార్‌ ఎ.కృష్ణ జ్యోతి, ఎలక్షన్‌ డిప్యూటీ తహసీల్దార్లు యన్‌వివి.సత్యనారాయణ, సుబ్బారావు, బి.రాజు సీనియర్‌ అసిస్టెంట్లు టి.లక్ష్మణ్‌, ఇందిరా బారు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

➡️