ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు

Apr 2,2024 22:06

 ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల్లో పాల్గొనే విభిన్న ప్రతిభావంతులకు ఎన్నికల కమిషన్‌ పలు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోందని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకొని వికలాంగులంతా శతశాతం తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అధ్యక్షతన కలెక్టర్‌ ఛాంబర్‌లో డిఎంసిఎఇ సమావేశం మంగళవారం జరిగింది. వికలాంగులు, విభిన్న ప్రతిభావంతుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్‌ కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలను వివరించారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలతోపాటు, వికలాంగుల సౌకర్యం కోసం ర్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలను గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల కోసం ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా రూపొందించిన సాక్ష్యం యాప్‌, వారికి ఎంతో సహాయకారిగా ఉంటుందని, దీనిని ప్రతీఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. ఓటరు జాబితాలో వికలాంగులుగా నమోదై ఉండీ, సదరం ధ్రువపత్రం ప్రకారం తమకు 40శాతంపైబడి వికలాంగత్వం ఉంటే, వారు ఇంటివద్దనుంచే ఓటు వేసే అవకాశం ఉందన్నారు. సాక్ష్యం యాప్‌ ద్వారా హోమ్‌ ఓటింగ్‌ కోసం ముందస్తుగా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవడానికి తమకు రవాణా సౌకర్యం కావాలన్నా, ఓటరు జాబితాలో పేరు తెలుసుకోవాలన్నా, తమ పోలింగ్‌ కేంద్రం వివరాలను తెలుసుకోవాలన్నా, వీల్‌ఛైర్‌, వాలంటీర్‌ సౌకర్యం కాల్సివచ్చినా ఈ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 580 వీల్‌ ఛైర్లను ఎన్నికల రోజు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అంథులకు బ్రెయిలీ లిపిలో ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో సుమారు 10,550 మంది అంథులు ఓటర్ల జాబితాలో నమోదై ఉన్నారని చెప్పారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్దా బ్రెయిలీ లిపిలో నమూనా బ్యాలెట్‌ పేపర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇవిఎంలపైనా బ్రెయిలీ లిపిలో నంబర్లు ఉంటాయన్నారు. లేదా వాలంటీర్‌ను ఉపయోగించుకొని తమ ఓటుహక్కును వినియోగించు కోవచ్చునని సూచించారు. చూపు తక్కువగా ఉన్నవారికోసం భూతద్దాలను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. ఐదు దశల్లో ఓటు వేసే ప్రక్రియ పూర్తి అవుతుందని, ఇది కూడా చాలావరకు విభిన్న ప్రతిభావంతులకు అనుకూలంగానే రూపొందించామని కలెక్టర్‌ వివరించారు. సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఎడి జివిబి జగదీష్‌, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు, సాంఘిక సంక్షేమాధికారి రామానందం, విద్యాశాఖ ఎడి బి.గౌరీశంకర్‌, కమిటీ సభ్యులు, సంక్షేమశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️