ఎన్నికల మార్గదర్శకాలు పాటించాలి

ప్రజాశక్తి-కొండపి : భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులు పూర్తిగా అవగాహన చేసుకొని బాధ్యతతో తమ విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి దినేష్‌కుమార్‌ తెలిపారు.స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని నోడల్‌ అధికారులు, ఎంసిసి, ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి, పోస్టల్‌ బ్యాలెట్‌ టీమ్స్‌, మానిటరింగ్‌ టీమ్స్‌కు శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల మార్గదర్శకాలను నోడల్‌ అధికారులు, ఎంసిసి, ఎప్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి , పోస్టల్‌ బ్యాలెట్‌ టీమ్స్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకూ ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అభ్యర్థుల ఖర్చు వివరాలు నమోదు చేయడం చాలా కీలకమని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రశాంతంగా పోలింగ్‌ను నిర్వహించడంలో పోలింగ్‌ అధికారులు పాత్ర ఎంతో కీలకమన్నారు. ఎన్నికల విధులు కేటాయింపబడిన ప్రతి ఒక్కరూ గురుతుర బాధ్యతగా ఎన్నికల విధులను నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలన్నారు. ఏ చిన్న సందేహం ఉన్నా వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. రిటర్నింగ్‌ అధికారులందరూ తమ బృందాల్లోని అధికారులను ఎన్నికలకు పూర్తిస్థాయిలో సంసిద్ధం చేసేలా బాధ్యత తీసుకోవాలన్నారు. అభ్యర్థుల ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత రిజిస్ట్రర్‌లో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ కోసం నియమింపబడిన నోడల్‌ ఆపీసర్స్‌, ఎంసిసి, ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి, పోస్టల్‌ బ్యాలెట్‌ టీమ్స్‌, మానిటరింగ్‌ టీమ్స్‌ ఎన్నికల విధులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని కలెక్టర్‌ సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను నిరోధించడానికి పనిచేస్తున్న నోడల్‌ ఏజెన్సీలు ఖచ్చితంగా ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అను గుణంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణపై రూపొందించిన సివిజిల్‌ యాప్‌, ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్మెంట్‌ సిస్టమ్‌లపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు గురించి మరియు సివిజల్‌ , ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్మెంట్‌ సిస్టమ్‌లపై మాస్టర్‌ ట్రైనర్స్‌ జిల్లా ఆడిట్‌ అధికారి శకంర నారాయణరెడ్డి, ఉపాధి కల్పన అధికారి భరద్వాజ్‌, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

➡️