ఏడాదిలోగా మాతాశిశు సంరక్షణ కేంద్రం పూర్తి

Feb 20,2024 21:16

పనుల పరిశీలనకు వచ్చిన జింకానా బృందం
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లోని జింఖానా ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసిహెచ్‌) నిర్మాణ పనులను జింకాన బోర్డు బృందం మంగళవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఎంసిహెచ్‌ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని అడిగి నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించింది. తొలుత బృందం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ను కలిసి పనులపై సమీక్షించింది. సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ ఎంసిహెచ్‌ నిర్మాణం గొప్పదని, ఇలాంటి ఆసుపత్రి సౌత్‌ ఇండియాలోనే ఉండదని అన్నారు. ఇప్పటికే ఆరు ఫ్లోర్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. జింకాన బోర్డు సభ్యులు పొదిల ప్రసాద్‌ మాట్లాడుతూ ఎంజిహెచ్‌ పేదలకు ఎంతో అండగా ఉండబోతుందని అన్నారు. డాక్టర్‌ ఉమా గవిని రూ.22 కోట్లు ఇచ్చారని, మిగతా జింకాన సభ్యులు మరో రూ.80 కోట్లను అందచేస్తున్నారని తెలిపారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. పొదిల ప్రసాద్‌ బ్లాక్‌లో రూ.రెండు కోట్లతో రెండంతస్తుల భవనాన్ని పూర్తి చేయనున్నుట్లు చెప్పారు. జింకాన బోర్డు చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ గంగ లక్ష్మి మాట్లాడుతూ రోగుల కష్టాలను చూసి తట్టుకోలేక ఎంసిహెచ్‌ నిర్మాణానికి పూనుకున్నామని చెప్పారు. తమ కుటుంబ సభ్యుల సహకారంతో రూ.3.5 కోట్లు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో జింఖానా కార్యనిర్వాహక సభ్యులు నాగభైరవ లాల్‌బహదూర్‌ శ్రీనివాస్‌, నాగభైరవ విజయలక్ష్మి, గంగా చౌదరి, జింకనా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బాలభాస్కరరావు పాల్గొన్నారు.

➡️