ఒపిఎస్‌పై పార్టీల వైఖరి వెల్లడించాలి

Feb 2,2024 23:08

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు :
సిపిఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణపై రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలని, ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి, మార్చిలో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్‌ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం బ్రాడీపేటలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో క్యాంపెయిన్‌ పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిపిఎస్‌పై జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాట తప్పిందన్నారు. రాష్ట్రంలో 11 లక్షల మంది ఉద్యోగులుంటే వారిలో 3 లక్షల మందికే ఒపిఎస్‌ ఉందని, మరో 3 లక్షల మంది సిపిఎస్‌లో ఉన్నారని తెలిపారు. సిపిఎస్‌ ఉద్యోగుల్ని ఓపిఎస్‌లోకి తేవాలన్నారు. మిగిలిన 5 లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా పెన్షన్‌ పాలసీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఒపిఎస్‌ అమలు చేసే వారికే రానున్న ఎన్నికల్లో తమ ఓటు అని స్పష్టం చేశారు. సిపిఎస్‌ విధానంలో ఉద్యోగుల వేతనాల నుండి ప్రతి నెలా మినహాయిస్తున్న కాంట్రిబ్యూషన్‌ ప్రభుత్వం దగ్గర ఉండట్లేదని, ఎన్‌ఎస్‌డిఎల్‌ ద్వారా షేర్‌ మార్కెట్లో పెడుతున్నారన్నారు. ఒపిఎస్‌ ద్వారా ప్రభుత్వం దగ్గరే పొదుపు ఉంటుందని, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. జయప్రకాష్‌ నారాయణ లాంటి కొందరు మేధావులు ఒపిఎస్‌ అమలు చేస్తే ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతుందని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ప్రతి ఏటా రూ.ఐదు లక్షల కోట్లు కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీల వల్ల ప్రభుత్వంపై భారం పడదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా పునరాలోచించి ఉద్యోగుల్ని మోసం చేసే చర్యలు మానుకోవాలని, ఒపిఎస్‌ పునరుద్దరించాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు ఎ.ఎన్‌.కుసుమకుమారి, యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్‌ ఎం.హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు బి.ఆదిలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్‌, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, నాయకులు సిహెచ్‌.ఆదినారాయణ, కె.కేథార్‌నాథ్‌, యం.కోటిరెడ్డి, కె.ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️