ఒప్పంద జీవోలు అమలుకు సత్యాగ్రహ దీక్ష

Jan 30,2024 21:06

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : 16 రోజుల మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ,గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ రాతపూర్వకంగా ఇచ్చిన హామీలకు వెంటనే జీవోలు ఇవ్వాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక నగరపాలక సంస్థ వద్ద కార్మికులు మంగళవారం సత్యాగ్రహం నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీతాలు లేక అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడిన ప్రొద్దుటూరు క్లాప్‌ ఆటో డ్రైవర్‌ ఆంజనేయులు చిత్రపటానికి సిఐటియు నగర కార్యదర్శి బి.రమణ పూలమాలవేసి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అనంతరం యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. జగన్మోహన్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్బంధాన్ని, పోటీ కార్మికుల్ని ఎదుర్కొని పోరాడి విజయం సాధించిన మున్సిపల్‌ కార్మికులకు జేజేలు తెలిపారు. చర్చల్లో గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ రాతపూర్వకంగా అంగీకరించిన బేసిక్‌ వేతనం పారిశుధ్య కార్మికులకు రూ.21వేలు, డ్రైవర్లకు రూ.24500, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ 75వేలు, మట్టి ఖర్చులు రూ.20వేలు, సహజ మరణానికి రూ.2లక్షలు, విధుల్లో మరణిస్తే 7 లక్షలు ఇస్తామన్న జీవోలు వెంటనే ఇవ్వాలని, ఇంజినీరింగ్‌ కార్మికులకు స్కిల్‌, సెమిస్కిల్డ్‌ వేతనాలు, క్లాప్‌ వాహన డ్రైవర్లకు చట్టబద్ధమైన జీత,భత్యాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఇచ్చిన జీవో నెంబర్‌ 12 , 17, ప్రకారం సంక్రాంతి కానుక రూ. 1000, సమ్మె కాలపు జీతం ఇవ్వాలని, సరెండర్‌ లీవ్‌ డబ్బులు చెల్లించాలని, రక్షణ పరికరాలు, పనిముట్లు ఇవ్వాలని, జిపిఎస్‌ అకౌంట్లో ఓపెన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సత్యాగ్రహంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు రెడ్డి శంకర్రావు, నాయకులు పైడిరాజు, రాఘవ ,మురళి, వంశీ, నారాయణరావు, సూరి, శంకర్రావు, లక్ష్మి,నాగరాజు, అప్పలరాజు పాల్గొన్నారు.

రాజాం : మున్సిపల్‌ సమ్మె ఒప్పందాల అమలు కోసం గాంధీ వర్ధంతి సందర్భంగా రాజాం మున్సిపల్‌ కార్యాలయం వద్ద సత్యాగ్రహం దీక్షను సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రామ్మూర్తి నాయుడు ప్రారంభించారు. అనంతరంమాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై చర్చల్లో అంగీకరించిన ఒప్పందాలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మీద నమ్మకంతో సమ్మె విరమించి 17 రోజులు గడుస్తున్నా చర్చల్లో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి జీవోలు విడుదల చేయాలని, లేదంటే మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. దీక్షలో అనిల్‌ కుమార్‌, లక్ష్మీ, సింహాచలం, శోభన్‌ బాబు, కృష్ణ, రఘు, రాంబాబు, శంకర్రావు, చినబాబు, పాల్గొన్నారు.

➡️