ఓటరుగా చేరేందుకు నేడే ఆఖరు

Dec 8,2023 20:29

 ప్రజాశక్తి-విజయనగరం  :  ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేయడానికి 9వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సూచించారు. వివిధ నియోజకవర్గాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, ఎన్నికల డిటిలతో కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా ప్రక్రియపై నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, 18,19 ఏళ్ల వయసు వారి నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 2,700 వరకు ఆన్‌లైన్లో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని రేపటిలోగా పరిశీలించి ఆమోదించాలని ఆదేశించారు. 18 ఏళ్ల లోపువారి (కాబోయే ఓటర్లు) దరఖాస్తులను కూడా ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు. వీరికి వయసు 18 నిండిన తరువాత ఓటుహక్కు వస్తుందని చెప్పారు. ఫోటోలు మారిపోయిన, పేర్లు పదేపదే వచ్చిన వారి జాబితాను పరిశీలించి, సరిచేసేందుకు నివేదిక సిద్దంగా ఉంచాలని సూచించారు. ఓటర్ల జాబితాల్లో తప్పులు, మరణించిన ఓటర్లు, ఇంటి నంబరు ఇతర అంశాలు తప్పుగా నమోదైన వారి గురించి ప్రధాన రాజకీయ పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయని, వాటన్నిటినీ పరిశీలించి జాబితాలను సరిదిద్దాలని ఆదేశించారు. అన్ని రకాల దరఖాస్తులను శనివారంలోగా ఆన్‌లైన్‌ చేయాలని, ఈ నెల 17 లోగా వాటి పరిశీలన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఏ దరఖాస్తు అయినా 15 రోజుల్లోపలే పరిశీలన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తప్పుడు డోర్‌ నెంబర్లు, ఒకే డోర్‌ నెంబరులో పది మంది కంటే ఎక్కువగా ఉన్న ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా పరిశీలించి సరిచేయాలని సూచించారు. జాబితాలో ఒక ఓటరు పేరు ఒక్కసారి మాత్రమే రావాలని, డూప్లికేట్లు లేకుండా చూడాలని కలెక్టర్‌ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఇఆర్‌ఒలు తదితరులు పాల్గొన్నారు.

➡️