ఆ యజమానులపై చర్యలు తీసుకోవాలి: సిఐటియు

ప్రజాశక్తి-చీమకుర్తి: గ్రానైట్‌ గనులలో నిబంధనలు పాటించని క్వారీ యాజమాన్యాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక పంగులూరి కృష్ణయ్య భవనంలో జరిగిన సిఐటియు మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బి ఓబులేసు అధ్యక్షత వహించారు. కాలం సుబ్బారావు మాట్లాడుతూ జయ మినరల్‌ క్వారీలో బ్లాష్టింగ్‌ సమయంలో ఆనంద్‌బాబుకు ప్రమాదం జరిగి చేయి తీసేశారన్నారు. వారి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ప్రమాదాలు జరిగినపుడు మైనింగ్‌ అధికారులు తూతూ మంత్రంగా హడావుడి పర్యటనలు చేస్తున్నారన్నారు. సేఫ్టీవీక్స్‌ పేరుతో సమావేశాలు తప్ప, ప్రమాదాలు నివారించడంలో గ్రానైట్‌ యజమానులు, మైనింగ్‌ అధికారు లు విఫలమయ్యారన్నారు. ప్రభుత్వం ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని మోడి ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల విధానాలు ఆపి కార్మికులకు, రైతులకు ఉపయోగపడే విధానాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మోడి నాయకత్వంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడిందని, గత రెండు ఎన్నికలకు భిన్నంగా ఈసారి బిజెపి స్వతహాగా మెజార్టీ సాధించలేకపోయిందని అన్నారు. ఇది బిజెపికి నైతిక ఓటమని అన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక ఉద్యమాలను అణిచివేసిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేసిందన్నారు. దేశంపై నియంతృత్వాన్ని రుద్ది, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి గెలవాలన్న బిజెపి ఆశలు విఫలమయ్యాయన్నారు. నూతన ప్రభుత్వం నిరంకుశ పోకడలకు పోకుండా, కార్మిక సమస్యలపై కార్మిక సంఘాలతో చర్చించి పరిష్కారం చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు, నాయకులు పి వెంకటరావు, ఆర్‌ ఆంజనేయరెడ్డి, పి ఏడుకొండలు, పి పద్మ, అప్పలనాయుడు, కనకరాజు, కోటేశ్వరరావు, ఎన్‌ శివ, పిచ్చయ్య, డి సురేష్‌, వివిధ రంగాల నాయకులు పాల్గొన్నారు.

➡️