కన్నీటి జీవితమే నా కవిత్వం

Jan 28,2024 16:34 #Awards, #Kurnool
  • కేంద్ర సాహిత్యఅకాడమీ సభ్యులు బెల్లంకొండ ప్రసేన్‌
  • ఘనంగా అక్షరం`2024 పురస్కార ప్రదానం

ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ : జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ప్రవహించాయని కన్నీటి జీవితమే కవిత్వమైందని కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ప్రముఖకవి విమర్శకులు బెల్లంకొండ ప్రసేన్‌ అన్నారు. ప్రముఖకవి కాశీభట్ల వేణుగోపాల్‌ స్థాపించిన అక్షరం లిటరరీ ట్రస్ట్‌ అందించే ప్రతిష్టాత్మక అక్షరం`2024 పురస్కారం నగరంలోని మాంటిస్సోరి ఏక్యాంప్‌ పాఠశాలలో ఆయన అందుకున్నారు. కథారచయిత మారుతీ పౌరోహితం అధ్యక్షతన ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ కవికి మెదడు కవిత్వసారమని కవిత్వ రూపం భౌతికమని అన్నారు. కవి తన అభుభూతులను ప్రపంచం మీద రుద్దడం కాదన్నారు. విమర్శకులు విమర్శకులు కవిత్వ విమర్శను ఒకవైపు మాత్రమే చూస్తారని అలా చూడటం సరికాదన్నారు. అనుకున్నది అనిపించినది నిష్కర్శగా చెపినపుడు మాత్రమే కవిత్వవిమర్శ అన్నారు. కవిత్వం ఎలాగ చదవాలో కూడా కవికి తెలియాలని, బలపం ఎన్ని ముక్కలైనా రాస్తుందని, సోమరులైన పాఠకులు ఉన్నారన్నారు. సినిమా సమీక్షలు సాహిత్యమేనని, కవిత్వం కంటే ఎక్కువ ప్రయోజనం సినీమాకు ఉందన్నారు. కవిత్వమంటే ఉల్లాసం ఆనందం కలిగించడం కాదని కవిత్వంలో తాత్వికత చెప్పగలగాలన్నారు. ప్రసేన్‌ కవిత్వాన్ని పరిచయం చేసిన కవి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రసేన్‌ కవిగా విమర్శకుడుగా అనేక ప్రయోగాలు చేశాడని కవిత్వరూపం విషయంలో ఆయన వందేళ్ళు ముందుంటారన్నారు. విరోధాభాసలంకారంతో కవిత్వం చెప్పడం ఆయనకు మాత్రమే సాధ్యమన్నారు. ఇవాల్టి గాజాఘటనల్ని దాదాపు ముప్పై ఏళ్ళ క్రితమే పదనైన వాక్యాలుగా చెప్పడం ఆయనకు మాత్రమే సాధ్యమందన్నారు. ప్రపంచాన్ని లోతుగా చూసి కవిత్వాన్ని రాయడం కొందరికే సాధ్యమైతుందన్నారు. సభాధ్యక్షులు మాట్లడుతూ కవిగా పదనైనవాక్యాలు అర్థవంతమైన ప్రయోగాలు చేయడంలో ప్రసేన్‌లాంటి కవులు సాహిత్యలోకంలో అరుదుగా కనిపిస్తారన్నారు. అక్షరం ట్రస్ట్‌ వ్యవస్థాపకులు కాశీభట్ల వేణుగోపాల్‌ మాట్లాడుతూ కవిగా ప్రసేన్‌ తనకు శకలాలు శకలాలుగా మాత్రమే పరిచయమని, కవిగా కంటే ఆయన మనిషిగా గొప్పవాడన్నారు. కవిత్వంలో ప్రసేన్‌కు మాత్రమే చెందిన ఒక ప్రత్యేకత ఉంటుందని జిడ్డుక్రిష్ణమూర్తి చెప్పినట్లు ప్రత్యేకమైన తనదైన ఏకాంతం ఉంటుందన్నారు. ప్రముఖవైద్యులు డా.ఉమానాథరావు మాట్లాడుతూ కాశీభట్ల వేణుగోపాల్‌ కవిగా భాషా సాహిత్యాలకు జీవం పోస్తున్నారన్నారు. సభలో ప్రముఖవైద్యులు క్రిష్ణమోహన్‌, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, విరసం నాయకులు నాగేశ్వరాచారి, కథారచయిత్రులు డా.యం.ప్రగతి, కల్యాణదుర్గం స్వర్ణలత, కవులు టి.వెంకటేష్‌, ఇనాయతుల్లా, కవయిత్రి స్వయంప్రభ, సిఐ శ్రీనాథ్‌రెడ్డి, సాహిత్యాభిమానులు విశ్వనాథరెడ్డి, ఏవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️