కలిసి పనిచేద్దాం… విజయ దుందభి మోగిద్దాం

Feb 27,2024 21:43

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా నియోజకవర్గంలోని టిడిపి అభ్యర్థి విజయానికి కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధిద్దామని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అన్నారు. మంగళవారం జగదీష్‌ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని తన అనుచరులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి టిడిపి అభ్యర్థిగా ప్రకటించిన బోనెల విజరుచంద్రను ఆహ్వానించి ఆయనకు దుశ్శాలువాకప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. కుటుంబంలో వలే చిన్న చిన్న తగాదాలు వచ్చినా, అంతా కలిసికట్టుగా ఉండి పార్టీ గెలుపు కోసం పనిచేద్దామని వారంతా తెలిపారు. పార్టీలో రెండు వర్గాల పేరిట జరుగుతున్న ప్రచారానికి మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌ తెరదించేందుకు కృషి చేశారు. నియోజకవర్గంలోని మూడు మండలాలు, పురపాలక సంఘం పరిధిలోని నాయకులు, కార్యకర్తలు అభిమానులు అంతా కలిసికట్టుగా ఉండి టిడిపి గెలుపు కోసం పనిచేద్దామని వారంతా తెలిపారు. బుధవారం నుంచి అంతా కలిసి కట్టుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుదామని, అరమరికల్లేకుండా అంతా కలిసికట్టుగా పనిచేసి టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్వతీపురం సీటును గెలిపించి గిఫ్టుగా అందజేస్తామని తెలిపారు. పార్టీ గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తెలిపారు. టిడిపి అభ్యర్ధి బోనెల విజరుచంద్ర మాట్లాడుతూ ఇంతవరకు జరిగిన చిన్న చిన్న సంఘటనలను మరిచి, అరమరికలు లేకుండా ఉండి కలిసికట్టుగా పనిచేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేద్దామని తెలిపారు. ముగ్గురు కలిసికట్టుగా ఉంటే టీడీపీ గెలుపు సులభమని అక్కడకు వచ్చిన జగదీష్‌ అనుచర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మూడు మండలాలు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️