కొండభూమిని తీసుకోవడం అన్యాయం

Mar 4,2024 21:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు గొర్రెలు,మేకలు పెంపకం దారులు ఆధారపడే కొండ భూములు తీసుకోవడం అన్యాయమని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్య నారాయణ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట గొర్రెలు మేకల పెంపకం దార్లతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తిరాజేరు మండలం చినచామలాపల్లి సర్వే నెంబర్లు 1,2,3,100,101లో ఉన్న డి-పట్టా, సాగులో ఉన్న కొండపోరంబోకు, బంజరు, ఫారెస్టు అధికారులు మొక్కలు వేసి అప్పగించిన తోటతో కలిపి సుమారు 50 ఎకరాల భూమిని సాగుచేసుకుంటూ, జీవాలను మేపుకుంటూ గ్రామ గొర్రెలు మేకల పెంపకం దారులు బతుకుతున్నారని తెలిపారు. ఈ భూమి తప్ప వారికి ఏ ఆధారమూ లేదన్నారు. ఇటీవల ప్రభుత్వం కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ఈ 50ఎకరాల భూమిని తీసుకుంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారన్నారు. దీనివల్ల వృత్తిదారుల జీవనం దెబ్బతింటుందన్నారు. ఉన్న ఈ 50ఎకరాల భూమిని కోల్పోతే కనీసం మరుగుదొడ్ల సౌకర్యరానికి కూడా నోచుకోలేరన్నారు. ఈ భూమిని కోల్పోతే మొత్తం ఊరే ఖాళీ అయిపోతుందన్నారు. గతంలో పలు దఫాలుగా ఆందోళనలు చేస్తే న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని, కానీ తాజాగా మళ్లీ హద్దులు పోల్చడానికి అధికారులు వచ్చారని తెలిపారు. ఆభూమిని కృషి విజ్ఞానకేంద్రం ఏర్పాటుకు తీసుకోకుండా వృత్తిదారుల జీవనానికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. వృత్తిని కాపాడడానికి సొసైటీలకు భూమిని కేటాయించాలనే ప్రభుత్వ జీవోలు కూడా ఉన్నాయన్నారు. ధర్నాలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌, గ్రామ సర్పంచ్‌ భర్త మజ్జి శ్రీనివాసరావు, జి.తిరుపతి, ఎం.ఎరుకు నాయుడు, ఎస్‌.అచన్న, బి.వెంకటరావు, టి.శంకరరావు, ఎ.తవుడమ్మ, బి.రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️