కొత్తగా 108507 ఓట్ల నమోదు.. 101370 తొలగింపు

మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
రానున్న ఎన్నికలు అవాఛనీయ ఘటనలేమీ లేకుండా ప్రశాంతంగా, పారదర్శంగా నిర్వహించడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ కోరారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ స్పందన సమావేశ మందిరంలో గురువారం డిఆర్‌ఒ వినాయకంతో కలిసి కలెక్టర్‌ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 1926 పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక సారాంశ సవరణ-2024 కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 108507 నూతన ఓట్లను నమోదు చేయగా 101370 ఓట్లు తొలగించామని తెలిపారు. వి.వి.ప్యాట్స్‌ 130 శాతం అందుబాటులో ఉంచామన్నారు. 26083 మంది వికలాంగులు ఓటు హక్కు కలిగి ఉన్నారన్నారు. 80 ఏళ్ల ఓటర్లు 25590 మంది ఉండగా వందేళ్లు దాటిన వారు 58 మంది ఉన్నారన్నారు. మొత్తం 2326664 మంది జనాభా ఉండగా గతేడాది చివరినాటికి వీరిలో 179011 మంది ఓటర్లుగా ఉన్నారన్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి 6376 మంది చెంచుల్లో 3998 మంది ఓటుహక్కు కలిగి ఉన్నారని ప్రకటించారు. ఈ నెల 12వ తేది నుండి ఫ్రీజింగ్‌ ఉంటుందని, జనవరి-22న మదర్‌ రోల్‌ ఏర్పాటు చేస్తామని వివరించారు. ఎన్నికల విధుల నిర్వహణలో లోపాలుంటే తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు.

➡️