కోటప్పకొండ తిరునాళ్లకు గతంకంటే మెరుగ్గా ఏర్పాట్లు

Mar 5,2024 23:12

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో 8న నిర్వహించే ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ చెప్పారు. ఉత్సవాల నిర్వహణపై కోటప్పకొండ వద్ద జిల్లా అధికారులతో మంగళవారం సమీక్షించారు. అప్రోచ్‌ రోడ్లు ఏర్పాటు చేశామని, గతం కంటే మెరుగ్గా సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించామన్నారు. ప్రతిఒక్కరూ ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది మొత్తం కలిపి సుమారు 5000 మంది వరకు విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీస్‌ సిబ్బంది 3 వేల మంది బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలనూ ఏర్పాటు చేశామన్నారు. ప్రభలు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటలకే వాటి స్థానాల్లో చేరుకునేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉత్సవాల సమయంలో ప్రజలను రెచ్చగొట్టే పాటలు, రాజకీయ సమస్యలు సృష్టించే పాటలను పెట్టవద్దని కోరారు. కాలి నడకన వెళ్లే సందర్శకులు మెట్ల మార్గం సులువైందని ఘాట్‌రోడ్లో అనుమతి లేదని తెలిపారు. అందరికీ దర్శన సౌలభ్యం కోసం క్యూ లైన్లలో మార్పులు చేశామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాల ఏర్పాట్లు చేశామన్నారు. ప్రధానంగా ఘాట్‌రోడ్‌లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సాయంత్రం ఐదు గంటల నుండి తెల్లవారుజామున అయిదు గంటల వరకు ఉత్సవాలు జరిగే నేపథ్యంలో సందర్శకులు సహనంగా వ్యవహరించాలని, ప్రశాంత వాతావ రణంలో ఉత్సవాలు జరిగేటట్లు సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు. ఎలమంద, పెట్లూరివారిపాలెం రోడ్లను ప్రభల రాకకు, జెఎన్‌టియు రోడ్లను తిరుగు ప్రయాణానికి ఉపయోగించుకోవాలని సూచించారు. ఉత్సవాలకు ఎక్కువ సంఖ్యలో సందర్శ కులు రానున్న నేపథ్యంలో ఐదు లక్షల వాటర్‌ ప్యాకెట్లు, రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు, వాటర్‌ ట్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. నాలుగు చక్రాల వాహనా లను కిందనే పార్కు చేసుకొని పైకి వచ్చే విధంగా బస్సులను ఉపయోగించు కోవాలని సూచించారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌, డిఆర్‌ఒ వినాయకం, ఆర్‌డిఒ సరోజ, ఆలయ ఈవో శ్రీనివాసులురెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️