ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించాలి

Dec 21,2023 21:28

ప్రజాశక్తి-విజయనగరం, బొండపల్లి  :  ఖచ్చితమైన ఓటర్ల జాబితాలను రూపొందించాలని అధికారులను, జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.శ్యామలరావు ఆదేశించారు. ఆయన గురువారం జిల్లాలో పర్యటించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్షించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో చేపట్టిన సవరణ ప్రక్రియ గురించి ముందుగా జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి వివరించారు. దీనిపై రూపొందించిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను శ్యామలరావు తిలకించారు. వివిధ అంశాలపై ఇఆర్‌ఒలను ప్రశ్నించారు. వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు. వాటిపై తీసుకున్న చర్యలను ఆరా తీశారు.ధరఖాస్తుల తనిఖీ ఫారమ్‌ 6,7,8 తదితర దరఖాస్తులను పరిశీలకులు శ్యామలరావు తనిఖీ చేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి హాజరైన బిఎల్‌ఒలు, ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారుల సమక్షంలో దరఖాస్తుల పరిశీలన జరిగింది. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత బిఎల్‌ఒలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా అబ్జర్వర్‌ మాట్లాడుతూ ఖచ్చితమైన నివేదికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా తప్పులు దొర్లితే నియోజకవర్గాల ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఇఆర్‌ఓలు డి.వెంకటేశ్వర్రావు, సుదర్శన దొర, నూకరాజు, సుధారాణి, ఎంవి సూర్యకళ, బి.శాంతకుమారి, ఎ.సాయిశ్రీ , ఏఇఆర్‌ఓలు, డిటిలు పాల్గొన్నారు.గొట్లాంలో క్షేత్రస్థాయి తనిఖీ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జిల్లా పరిశీలకులు జె.శ్యామలరావు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఆరా తీశారు. చేర్పులు, తొలగింపులపై ఓటర్లను ప్రశ్నించారు. బిఎల్‌ఒలు ఓటర్లకు ఇచ్చిన రశీదులను, డెత్‌ సర్టిఫికేట్లను తనిఖీ చేసి సంతప్తిని వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ, గజపతినగరం ఇఆర్‌ఒ డి.వెంకటేశ్వర్రావు, బొండపల్లి తాహశీల్దార్‌ డి.ప్రసాద్‌, డిప్యుటీ తాహశీల్దార్‌ కె.సతీష్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️