గిరిజనం సమస్యలు పట్టవా..?

గిరిజనం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధినాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా గుర్తించాలని అనేకేళ్లుగా గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వివిధ రూపాల్లో, అనేకసార్లు ఆందోళనలు చేసినా కనీసం స్పందించడం లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నా, కనీస సౌకర్యాలు కరువై ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కొందరు అక్రమార్కులు హక్కులను హరిస్తూ భూములను ఆక్రమించుకుంటున్నా అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఇలా అనేక సమస్యల నడుమ జీవన పోరాటం చేస్తున్న గిరిజనుల గోడు ఎవరు పట్టించుకుంటారో, వారి సమస్యలు ఎప్పటికి పరిషారమవుతాయో నేటికీ స్పష్టత లేదు.అభివద్ధికి దూరంగా 56 సబ్‌ ప్లాన్‌ గ్రామాలుకాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని శంఖవరం మండలంలో 16 గ్రామాలు, రౌతులపూడి మండలంలో 20, ప్రత్తిపాడు మండలంలో 20 గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 35 వేల మంది జనాభా నివశిస్తున్నారు. ఈ గ్రామాలను ఐటిడిఎలో విలీనం చేసి అభివృద్ధి చేయాలని అనేకేళ్లుగా గిరిజనులు డిమాండ్‌ చేస్తునే ఉన్నారు. పెదమల్లాపురం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్వాతంత్య్ర వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు నోచుకొని గిరిజనులు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. నాన్‌ షెడ్యూల్‌లో ఉన్న వీరంతా అనేకేళ్లుగా హక్కులను కోల్పోతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ గ్రామాల్లో అమలు కావడం లేదు. మౌలిక సదుపాయాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నిధులను కేటాయించడం లేదు. పలు ప్రాంతాల్లో నేటికీ విద్యుత్‌ సౌకర్యం లేదు. ఉన్నా… పలు గ్రామాల్లో ఓల్టేజీ సమస్య ఎక్కువగా ఉంటోంది. బస్సులు మాటే మరిచారు. ప్రైవేటు వాహనాలు కూడా తిరగని దుస్థితి నెలకొంది. సొంత వాహనాలు ఉంటేనే ప్రయాణాలు చేసే పరిస్థితి ఉంది. అత్యవసరమైతే కాలినడకన బయల్దేరి వెళాలి. ఆరోగ్య సమస్యలు వస్తే రూ.వేలల్లో ఖర్చు చేసి ప్రైవేటు వాహనాల్లో తీసుకుని వెళ్ళాలి. ఎమర్జెన్సీ సమయాల్లో అనేకమంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. అక్రమార్కుల చేతుల్లో భూములుఅమాయక గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై వారికే హక్కులు ఉండడం లేదు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు అక్రమార్కులు రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్నారు. అధికారులను మభ్యపెట్టి భూములను అనుభవిస్తున్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. ఆక్రమణలు చేస్తూ దోచుకుంటున్నారు. అక్రమంగా అమ్మకాలు సాగిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. రౌతులపూడి మండలం రాఘవపట్నంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సుమారు 80 ఎకరాల భూములు కొనుగోలు చేసి అక్కడే బోర్డును ఏర్పాటు చేసి దర్జాగా అనుభవిస్తున్నారనే ఆరోపణలు గతంలో వచ్చాయి. బవురువాక అనే చిన్న గ్రామంలో మరో 100 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా భూముల విషయంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.

➡️