గిరిజనుల కష్టాలను సిఎంకు వివరిస్తా

Jan 17,2024 21:36

ప్రజాశక్తి-శృంగవరపుకోట  :  గిరి శిఖరాల పైన ఉండే గిరి పుత్రుల కష్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డివిజి శంకర్రావు అన్నారు. గిరి పుత్రుల డోలిమోతలపై ప్రజాశక్తిలో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించి బుధవారం మండలంలోని మూల బొడ్డవర పంచాయతీ చిట్టెంపాడు గ్రామంలో చనిపోయిన మాదాల గంగమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె భర్త గంగులను ఓదార్చారు. అనంతరం ఆయన అక్కడ యువతతో మాట్లాడగా వారు పలు సమస్యలను చైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చారు. విశాఖ కేెజిహెచ్‌ లో వైద్యం మాత్రమే చేస్తున్నారని, సరైన మందులు ఇవ్వటం లేదని వారు వాపోయారు. గిరిజనులకు అందాల్సిన హక్కులు సక్రమంగా అందటం లేదని. గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక నాన్న అవస్థలు పడుతున్నామని తెలిపారు. గంగులు కుటుంబాన్ని ఓదార్చిన చైర్మన్‌ సమస్యలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొట్టాం పిహెచ్‌సి వైద్యులు శిరీష, గిరిజన నాయకులు జె.గౌరీష్‌, తుమ్మి అప్పలరాజు దొర, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

➡️