గిరిజన నాయకుడు పై దాడి హేయమైన చర్య

Mar 18,2024 21:13

ప్రజాశక్తి- శృంగవరపుకోట : ఆదివాసి గిరిజన సంఘం నాయకుడు జరతా గౌరీస్‌ పై ఉపాధ్యాయురాలు, ఆమె భర్త చేసిన దాడి హేయమైన చర్య అని సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు గాడి అప్పారావు అన్నారు. గిరిజన నాయకుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ స్టేషన్‌లోనూ ఎంఇఒ కార్యాలయంలోనూ సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని దారపర్తి పంచాయతీ పల్లపు దుంగాడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలకు హాజరు కాకున్నా ఒక ప్రైవేటు వ్యక్తిచే పాఠశాలను నడిపిస్తున్నారని గిరిజన సంఘం నాయకుడిగా ప్రశ్నించినందుకు ప్రధానోపాధ్యాయురాలు, ఆమె భర్త కలిసి గిరిజన సంఘం నాయకుడి పై దాడి చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. గౌరీష్‌ గతంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడిగా పని చేసే వారిని ప్రస్తుతం సిపిఎం ఆధ్వర్యంలో గిరిజన సంఘంలో పనిచేస్తున్నారని చెప్పారు. గిరిజన గ్రామాలలో విద్యకు దూరమవుతున్న గిరిజనులు పట్ల చలించి స్థానికుడైన ఓ గిరిజన వ్యక్తిగా గిరిజన హక్కులకై పోరాటం చేస్తూ ఉపాధ్యాయుల దుర్మార్గాన్ని నిలదీశాడని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడని అక్కడ పాఠశాల హెచ్‌ఎం తన భర్తను తీసుకొచ్చి గౌరీష్‌ పై దాడి చేయించారన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ భౌతికదాడికి దిగారాని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ వృత్తికే అవమానం చేకూరుస్తున్న ఉపాధ్యాయు లపై సస్పెన్స్‌న్‌ వేటు వేయాలని లేనిపక్షంలో ఏపీ గిరిజన సంఘం, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానికులను కలుపుకొని ఈ దుర్మార్గం పై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బాధితుడు గౌరీషు, గిరిజన సంఘం నాయకులు రమసాల శివ, సిపిఎం పార్టీ సభ్యులు చెలికాని ముత్యాలు పాల్గొన్నారు.

➡️