గిరిధర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం

ఎమ్మెల్యే గిరిధర్‌తో మాట్లాడుతున్న మంత్రి విడదల రజిని
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
గుంటూరు పశ్చిమ టిక్కెట్‌ దక్కని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ను శాసన మండలికి పంపుతామని సిఎం జగన్‌ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన సిఎం జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. పార్టీకి సేవలను ఉపయోగించుకుంటామని, వైసిపి మళ్లీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్‌ చెప్పారు. అయితే 2025 వరకు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగే అవకాశం లేని దృష్ట్యా గిరిధర్‌ కొంత అసంతృప్తి గురైనట్టు తెలుస్తోంది. టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి వైసిపిలోకి వచ్చిన ఆయనకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇస్తారని ఆశించినా అనూహ్యంగా ఆయన స్థానంలో మంత్రి రజనీకి అవకాశం కల్పించారు. ఇక్కడ కాకున్నా తెనాలి లేదా సత్తెనపల్లిలో అవకాశం ఇస్తారని భావించినా అవీ దక్కలేదని, ఎమ్మెల్సీ పదవి హామీతో సరిపెట్టారని గిరిధర్‌ అనుచరులు చెబుతున్నారు. మరోవైపు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా ఇప్పటికే రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించిన మంత్రి రజనీ సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే గిరిధర్‌ నివాసానికి వెళ్లి ఆయన్ను, ఆయన భార్యను కలిశారు. పార్టీ విజయం కోసం కృషి చేయాలని కోరగా సహకరిస్తానని గిరిధర్‌ హామీనిచ్చారు.

➡️