‘గీతం’లో ముగిసిన అంతర్జాతీయ సదస్సు

Feb 2,2024 21:52
గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం

ప్రజాశక్తి -మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, స్కూల్‌ ఆఫ్‌ ఫార్మశీ ఆధ్వర్యంలో ‘ఆరోగ్య రక్షణ పరిశోధనలకు అవకాశాలు -సవాళ్లు’ అనే అంశంపై రెండురోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. దేశ, విదేశాల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొని, ఔషధ రంగంలో వస్తున్న మార్పులపై చర్చించారు. కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులపై జరుగుతున్న పరిశోధనలను వివరించారు. అమెరికాలోని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటిక్స్‌ విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ జయంత పాణ్యం మాట్లాడుతూ కేన్సర్‌ చికిత్సకు సాధారణ మందుల కంటే వ్యాధి నిరోధకశక్తిని ప్రేరేపించే వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తాయన్నారు. ఈ దిశగా తమ ప్రయోగశాలలో జరుగుతున్న అధ్యయనాలను వివరించారు. ఈజిప్టు కైరోలోని షామ్స్‌ విశ్వవిద్యాలయం ఇండిస్టియల్‌ ఫార్మశీ ప్రొఫెసర్‌ మహనాజర్‌ మాట్లాడుతూ, సోరియాసిస్‌, చర్మ కేన్సర్‌ నివారణలో నానో ఔషధాలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు. లుసియానా స్టేట్‌ విశ్వవిద్యాలయం, స్కూల్‌ ఆఫ్‌ వెటర్నరీ మెడిసిన్‌ పరిశోధకుడు ప్రొఫెసర్‌ సీతారామ జోయిస్‌ మాట్లాడుతూ ఊపిరితిత్తుల కేన్సర్‌ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందని , దీని చికిత్సకు జరుపుతున్న పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. బ్రెజిల్‌ చెందిన ఫెడరల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎబిసి, నానో మెడిసిన్‌ నిపుణుడు ప్రొఫెసర్‌ ఆర్‌.క్యాస్ట్రో మాట్లాడుతూ ఔషధ ఉత్పాధన రంగంలో బ్యాక్టిరియల్‌ సెల్యులోజ్‌ వినియోగంపై వివరించారు. మలేషియాలోని యూనివర్సిటీ టెక్నాలజీ మారా విద్యాలయం బయోమెడికల్‌ నిపుణుడు ప్రొఫెసర్‌ వాంగ్టన్‌ వురు మాట్లాడుతూ రోగి లక్షణాలను విశ్లేషించి, దానికి తగ్గట్టుగా ఔషధాలను డిజైన్‌ చేసే పద్దతులపూ తమ ప్రయోగశాలను అధ్యయనం చేస్తోందన్నారు. సదస్సులో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పరిశోధకులు వివిధ అంశాలపై అధ్యయనాలను వివరించారు.గీతం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ డి. గుణశేఖరన్‌, స్కూల్‌ ఆఫ్‌ ఫార్మశీ డీన్‌ ప్రొఫెసర్‌ జగత్తరణ్‌ దాస్‌ అధ్యక్షత వహించిన సదస్సులో గీతం స్కూల్‌ ఆఫ్‌ ఫార్మశీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రాజా, ప్రొఫెసర్‌ జి. శివకుమార్‌, సదస్సు కన్వీనర్‌ డాక్టర్‌ పార్థారారు, కో-కన్వీనర్‌ డాక్టర్‌ పి.నరేష్‌ పాల్గొన్నారు. సదస్సులో అత్యత్తమ సైంటిఫిక్‌ పోస్టర్లను ప్రచురించిన యువ పరిశోధకులకు గీతం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌ అవార్డులను అందజేశారు.

అవార్డులను అందిస్తున్న గీతం రిజిస్ట్రార్‌ గుణశేఖరన్‌

➡️