గ్రామ స్వరాజ్యం.. ఎలా సాధ్యం?

Jan 17,2024 21:45

 ప్రజాశక్తి-వీరఘట్టం :  గాంధీ కన్న కలలు నిజం కావాలని, గ్రామస్థాయిలో సుపరిపాలన ప్రజలకు అందించడమే తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి నుంచి స్థానిక ప్రజాప్రతినిధి వరకూ ఏ కార్యక్రమం, సమావేశం జరిగినా ఒకటే ఊకదంపుడు ఉపన్యాసం. ఆచరణకు వచ్చేసరికి చిత్తశుద్ధి కరువవుతోంది. అందుకే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ప్రభుత్వ భవనాలు అర్ధాంతరంగా దర్శమిస్తున్నాయి. ఎంతో అట్టహాసంగా శంకుస్థాపనలు చేసిన సచివాలయాలు, రైతుభరోసా, వెల్‌నెస్‌ సెంటర్ల భవన నిర్మాణాలు అనేక చోట్ల పునాదులకే పరిమితం అయ్యాయి.మండలంలోని 24 సచివాలయాలున్నాయి. వాటి పరిధిలో 24 రైతు భరోసా కేంద్రాలు, 17 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణ పనులు చేపట్టారు. మండలంలోని వండువ, కిమ్మి, తలవరం, కత్తులకవిటి, తూడి, చిదిమి, నడిమికెల్ల, చిట్టపూడివలస, దశమంతపురం, హుస్సేనపురం, తెట్టంగి గ్రామాల్లో సచివాలయ భవనాలకు సంబంధించి దాదాపుగా పనులు పూర్తయ్యాయి. వండువ, తెట్టంగి గ్రామాల్లో మాత్రమే ప్రారంభోత్సవం జరిగాయి. మిగిలిన చోట్ల పనులు పూర్తి అయినప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. వీరఘట్టంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద స్లాబ్‌లకే పరిమితమయ్యాయి. రేగులపాడు, నడుకూరు, చలివేంద్రి, చిన్నగార కాలనీ, బిటివాడ, నీలానగరం, తదితర గ్రామాల్లో పునాదులకే పరిమిత మయ్యాయి. నీలానగరం గ్రామంలో సచివాలయ కార్యకలాపాలు గ్రామంలో కోటి రూపాయలతో నిర్మించిన వసతిగృహంలో కొన సాగుతున్నాయి.పునాదులకే పరిమితం మండలంలోని దశమంతపురం, రేగులపాడు, వీరఘట్టం, చిన్నగారకాలనీ, చలివేంద్రి, నడుకూరు, నడిమికెల్లా, వండువ, నర్సిపురం, కంబర తదితర గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పునాదులకే పరిమితమయ్యాయి. కిమ్మి, బిటివాడ, హుస్సేనపురం గ్రామాల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. చిదిమి, చిట్టపూడివలస, తూడి, తెట్టంగి, పనసనందివాడ, తదితర గ్రామాల్లో స్లాబులు వేసి దర్శనమిస్తున్నాయి. నీలానగరం గ్రామంలోని వసతిగృహంలో ఆర్‌బికె నిర్వహణ కొనసాగిస్తున్నారు.బోర్డులకే పరిమితమైన వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లు మండలంలోని చిన్నగారకాలనీ, దశమంతపురం, చలివేంద్రి, చిదిమి, వీరఘట్టం, తలవరం, పనసనందివాడ, కంబర, చిట్టపూడివలస, కిమ్మీ, నడిమికెల్ల, తెట్టంగి గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్‌లు బోర్డులకు పరిమితం అయ్యాయి. గ్రామాల్లో 104 సేవలు అందించినప్పుడు చెట్ల నీడలో, ఇరుకైన గదుల్లో ప్రజలకు సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామాల్లో ఆర్భాటంగా శంకుస్థాపనలకు పరిమితం అయ్యారే తప్ప ఎక్కడా పూర్తి కాకపోవడంతో సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు, వైద్య సిబ్బంది విధులు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సిబ్బంది పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్ధాంతరంగా నిలిచిపోయిన భవన నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

➡️