ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Mar 8,2024 23:55

సత్తెనపల్లిలో బైక్‌ ర్యాలీలో మంత్రి రాంబాబు, మహిళలు
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ :
మహిళా సాధికారితే తమ ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణం మహిళలతో కలిసి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైసిపి కార్యాలయంలో వేడుకలు నిర్వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి రాంబాబు మాట్లాడుతూ మాహిళా సాధికారిత అనే పదం కేవలం మాటలకే పరిమితం చెయ్యక ఆచరణలో ముందుకు పోతున్నామన్నారు. అందులో భాగంగా మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థల ద్వారా మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. అనంతరం పలువురు మహిళలను సత్కారించారు. కార్యక్రమంలో వైసిపి మహిళా విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ గీతాహసంతి, ముప్పాళ్ల జెడ్‌పిటిసి ఎస్‌.నాగేశ్వరమ్మ, సునీతారెడ్డి, శశికళ, డాక్టర్‌ షకీలా శ్రీధర్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు మాధవిరెడ్డి, వృందా కళాశాల డైరెక్టర్‌ అనుషా, సిడిపిఒ శ్రీలత పాల్గొన్నారు.
ప్రజాశక్తి – చిలకలూరిపేట : స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులో మెప్మా అధికారులు, ఆర్‌పిలు మహిళా దినోత్సవం నిర్వహించారు. మెప్మా సిఎంఎం మాలతి మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రతి రిసోర్స్‌ పర్సన్‌ల సేవలు అమోఘమని వారికి ప్రతినెలా గౌరవవేతనం వచ్చేలా సహకరిస్తామన్నారు. నిరంతరం గ్రూపులు ఏర్పాటు చేసి అవి సరిగా నడిచేలా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని అభినందించారు. అనంతరం ఆర్‌పిలను సత్కరించారు. ఐ.బి.విరా స్వామి, సిఒలు ఇందిర, ఆదినారాయణ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఎం.సునీత, శ్రీనివాస, రవి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఫారూఖ్‌ పాల్గొన్నారు.మహిళలు తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక మార్పుపై అవగాహన పెంచుకోవాలని, వాటి సాధనకు ఉద్యమించాలని మిత్ర సర్వీసెస్‌ సొసైటీ అధ్యక్షులు కె.నాగేశ్వరరావు అన్నారు. స్థానిక రైతు బజార్‌ ఎదురుగా ఉన్న మదర్‌ థెరిస్సా విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన అనంతరం ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని ప్రశాంతి వృద్ధాశ్రమ నిర్వాహకురాలు షేక్‌ అమీనా, కౌన్సిలర్‌ షేక్‌ సుభాని మిరాబిని సత్కరించారు. మహిళా దినోత్సవం నేపథ్యాన్ని వివరించారు. మిత్ర సర్వీస్‌ సొసైటీ ఉపాధ్యక్షులు బి. శ్రీనునాయక్‌, కోశాధికారి జి.బాలసుబ్రమణ్యం, విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు టి.వెంకటనగేష్‌, ఎఐవైఎఫ్‌ పల్నాడు జిల్లా కన్వీనర్‌ సుభాని పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మహిళల అభ్యున్నతికి, సమాజాభివృద్ధికి తోడ్పడే బాలికలకు విద్య నేర్పిస్తున్న ఉపాధ్యాయినులు మహిళా సాధికారత సాధనలో మరింతగా భాగస్వామ్యం కావాలని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయ సారధి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా కార్యాలయంలో ఉపాధ్యాయినులను సత్కరించారు. వీరితో పాటు శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారిని ఉపాధ్యాయినులు సన్మానించారు. ఈ సందర్భంగా శివకుమారి మాట్లాడుతూ ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేకత, హోదాను, గుర్తింపును తెచ్చుకుంటున్నారని అన్నారు. కీలక పదవుల్లోనూ రాణిస్తున్నారని, రాజకీయంగానూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని అన్నారు. యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా సహాధ్యక్షులు ఎ.బాగేశ్వరిదేవి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎన్నో రంగాల్లో తమ అద్భుతమైన ప్రతిభను చాటుతున్నా దాడులు మాత్రం ఆగడం లేదన్నారు. మహిళా రక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చినా పెద్దగా ఫలితం ఉండడం లేదని, చట్టాల అమలులో చిత్తశుద్ధి అవసరమని చెప్పారు. మహిళా హక్కులను గౌరవించాలనే స్పృహ సమాజంలో పెరగాలన్నారు. ఉపాధ్యాయిని షేక్‌ మల్లికా బేగం మాట్లాడుతూ రాణి రుద్రమాదేవి, వీరనారి ఝాన్సీలక్ష్మిభాయి వంటి మహనీయులు కనబడుతారని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచిత ఉద్యమాన్ని నడిపించిన మల్లు స్వరాజ్యమూ ఇప్పటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. అంతరిక్షం వరకు దూసుకుపోయి తన జీవితాన్ని జాతికి అంకితం చేసిన కల్పనాచావ్లా, అంధురాలైనప్పటికీ మహిళల అభ్యున్నతికై పోరాడిన హెలెన్కిల్లర్‌ కూడా ఒక దీర వనితేనని చెప్పారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు ఎం.మోహకరావు, కార్యదర్శి టి.వెంకటేశ్వర్లు, ఉషాశౌరిరాణి, జి.రాఘవమ్మ, కార్మెల్‌మేరి, ఎన్‌.జ్యోతి, కె.శివపార్వతి, మాధవి, గౌరి పాల్గొన్నారు.

➡️