ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

Dec 25,2023 23:01
క్రిస్మస్‌ వేడుకలు

ప్రజాశక్తి – యంత్రాంగం

క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. కోటనందూరు శాంతికి నిదర్శనం క్రైస్తవులు అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పట్టణంలో సిబిసి చర్చిలో సోమవారం జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో క్రైస్తవులు శాంతికి నిదర్శనంగా ఉంటారని, భిన్నత్వంలో ఏకాత్వం గల భారతదేశంలో సర్వమతాలో సమానమైనవని అన్నారు. కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌బి .పట్నంలో గిడియన్‌ ఆర్మీ వ్యవస్థాపకులు బిఎల్‌.రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్‌ సందర్భంగా వృద్ధులు, వికలాంగులకు నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కోటనందూరు, కె చెన్నయ్యపాలెం, జగన్నాధపురం, బిహెచ్‌.కోట గ్రామాల్లో క్రిస్మస్‌ సంబరాలు ఘనంగా జరిగాయి. సామర్లకోట రూరల్‌ పట్టణంలో పలు క్రైస్తవ దేవాలయాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఏసుక్రీస్తు జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకొని క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవ ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. ఆంధ్ర బాప్టిస్ట్‌ చర్చిలో జరిగిన క్రిస్టమస్‌ వేడుకల్లో రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ దవులూరి దొరబాబు, రాష్ట్ర కార్మిక నాయకులు దవులూరి సుబ్బారావు పాల్గొని క్రిస్టమస్‌ శుభాకాంక్షలు తెలిపారు. సంఘ కాపరి రెవ. బి.కిరణ్‌ కుమార్‌ను, పలు దేవాలయాల్లో సంఘ కాపరులను రాష్ట్ర కార్మిక నాయకులు సుబ్బారావు దుస్సాలువాతో సత్కరించి గౌరవించారు. పేదలు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే సెంటినరీ బాప్టిస్ట్‌ చర్చ్‌, షారోన్‌ బాప్టిస్ట్‌ దేవాలయాల్లో జరిగిన వేడుకల్లో సంఘ కాపరి రెవరెండ్‌ ఆర్‌ లాజరస్‌ ఆధ్వర్యంలో దవులూరి దొరబాబు 200 మందికి వస్త్రాల పంపిణీ చేశారు. క్రిస్మస్‌ సందర్భంగా నిర్వహించిన కొవ్వొత్తుల ఆరాధన, కేక్‌ కటింగ్‌, చిన్నారులం నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంగిరెడ్డి అరుణ, పెద్దాపురం మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌, కౌన్సిలర్లు పిట్టా సత్యనారాయణ, పాలిక కుసుమ చంటిబాబు, కానేటి రాజేశ్వరి, బుల్లి అప్పారావు, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు సల్లూరి కళ్యాణ్‌, తదితరలు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలంలోని పలు క్రైస్తవ మందిరాల్లో ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాళ్లరేవు పెంకె వారి పేటలోని న్యూ లైఫ్‌ బేతెస్త మందిరంలో ఫాస్టర్‌ అభిషేక్‌ రూభేన్‌, రూతమ్మ ఆధ్వర్యంలో చిన్నారులు క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వందలాది మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాంతి రాజు, తదితరులు పాల్గొన్నారు. జడ్‌పిటిసి దొమ్మేటి సాగర్‌ ఆధ్వర్యంలో తాళ్లరేవు ప్రధాన చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు. పెద్దాపురం పెద్దాపురం పట్టణంలో, మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సోమవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక లూధరన్‌ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ ప్రార్థనలలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, దవులూరి సుబ్బారావు, వైస్‌ ఛైర్మన్‌ నెక్కంటి సాయి ప్రసాద్‌, కళ్యాణ్‌, సర్పంచులు, ఎంపిటిసిలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు. స్థానిక యేసు కృపాలయంలో బోండా భాస్కర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో వైస్‌ ఛైర్మన్‌ నెక్కంటి సాయి ప్రసాద్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ విడదాసరి రాజా, వైసిపి నాయకులు చింతా శ్రీనివాసరావు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పేదలకు వస్త్ర దానం చేశారు.

➡️