ఘనంగా డియర్‌ కామ్రేడ్‌ పుస్తకావిష్కరణ

డియర్‌ కామ్రేడ్‌ పుస్తకావిష్కరణ

ప్రజాశక్తి-కాకినాడపార్టీలో, ప్రజా ప్రతినిధిగా ఏ పదవులూ చేపట్టని ఒక సాధారణ కార్యకర్తను రెండు దశాబ్దాలు గడిచినా స్మరించు కోవడం, ఆయనపై ఒక పుస్తకం రావడం తెలుగు నేలపై అరుదైనదని డాక్టర్‌ చెలికాని రామారావు మెమోరియల్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ చెలికాని స్టాలిన్‌ అన్నారు. నిబద్ధత కలిగిన కమ్యునిస్ట్‌ కుడిపూడి సూర్యనారాయణ (కెఎస్‌)పై సిపిఎం రూరల్‌ మండల కమిటీ ప్రచురించిన వ్యాస సంకలనం డియర్‌ కామ్రేడ్‌ పుస్తకావష్కరణ సభ స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో సిహెచ్‌.విజరు కుమార్‌ అద్యక్షతన బుధవారం నిర్వహించారు. డాక్టర్‌ స్టాలిన్‌ పుస్తకావిష్కరణ చేసి ప్రసంగించారు. వితంతువును వివాహం చేసుకుని, తమ పిల్లలకు ఆదర్శ వివాహాలు చేసి, ప్రభుత్వ ఉద్యోగిగా నిజాయితీగా ఉంటూ, భాద్యతల్లో వివిధ ప్రాంతంలో నివాసమున్న చోటల్లా అక్కడి ప్రజలతో మమేకమై నిలువెల్లా మంచి మనిషిగా జీవించిన గొప్ప కమ్యునిస్ట్‌ కుడిపూడి సూర్యనారాయణ అని కొనియాడారు. ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ విలువలకు తిలోదకాలు ఇచ్చి నడుపుతున్న నేటి రాజకీయాలకు విరుగుడు కెఎస్‌ లాంటి వారి జీవితాలేనన్నారు. తాను గెలిచే అవకాశమున్న సర్పంచ్‌ పదవిని త్యాగం చేసి యువకులను ప్రోత్సహించిన నికార్సయిన కమ్యూస్ట్‌ కెఎస్‌ అన్నారు. నేటి తరానికి రోల్‌ మోడల్‌ కావాల్సిన ఆయనపై వ్యాస సంకలనం పుస్తకం ప్రచురించడం అభినందనీయమన్నారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ మాట్లాడుతూ కమ్యునిస్ట్‌ పార్టీ పూర్తికాలం కార్యకర్తలను ప్రేమతో చూస్తూ వారి సాదక బాధకాలను పట్టించుకుని సహకరించిన మహనీయుడు కెఎస్‌ అని కొనియాడారు. కెఎస్‌ స్నేహితుడు ఆర్‌పిఐ సీనియర్‌ నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు గారా చిట్టిబాబు, గోపు చంద్రరావు మాట్లాడుతూ కెఎస్‌తో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దింశెట్టి రామకృష్ణ, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, వి.చంద్రరావు, గుత్తుల రామకృష్ణ, చింతపల్లి వి.రమణ, గుండుబోగుల శ్రీనివాస్‌, ఎం.రామ్మోహన్‌, సత్యనారాయణ మాట్లాడారు. పిఎన్‌ఎం కళాకారులు జుత్తుగ శ్రీనివాసరావు, తానీషా, జిఎస్‌ఆర్‌.కృష్ణ అభ్యుదయ గేయాలను ఆలపించారు. కెఎస్‌ కుమార్తె రాజ్యలక్ష్మి దుస్తులు పంపిణీ చేశారు. మేకా సుబ్బారావు, కెఎంఎంఆర్‌. ప్రసాద్‌, గౌరవ్‌, పిఎస్‌.ప్రకాశరావు, వి.రవికుమార్‌, అజరు కుమార్‌, కిరణ్‌ కుమార్‌, అనూరాధ నాగదేవి, సోనీ, తేజ, రమణి, త్రిమూర్తులు, సాహిత్‌ చిట్టూరి, వాసు పాల్గొన్నారు.

➡️