చిట్టెంపాడులో విషాదం

Jan 16,2024 22:17

ప్రజాశక్తి-శృంగవరపుకోట : మండలంలోని మూల బొడ్డవర పంచాయతీలో హృదయ విదాకరణమైన సంఘటన చోటు చేసుకుంది. గిరి శిఖర గ్రామం చిట్టెంపాడు గిరిజనులు అనారోగ్యం బారినపడితే డోలీ మోతలే వారికి గత్యంతరం అవుతున్నాయి. వారికి రహదారి సదుపాయం లేకపోవడంతో వారి ప్రాణాలు గాలిలోనే కలిసిపోతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 57ఏళ్లవుతున్నా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు లేకపోవడంతో గ్రామంలో నిత్యం మరణాలు సంభవిస్తున్నాయి. చిట్టెంపాడు గ్రామానికి చెందిన మాదల గంగమ్మ, తన ఆరు నెలల చంటిబిడ్డ తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో ఈనెల 5న భర్త గంగులు తోటి గిరిజనుల సహాయంతో వారిని డోలీలో ఏడు కిలోమీటర్లు మోసుకుంటూ బొడ్డవర వరకు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి 108 వాహనంలో వైద్యం కోసం శృంగవరపుకోట పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా విశాఖ కెజిహెచ్‌కు తల్లీ బిడ్డను రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరు నెలల పసిపాప ఈనెల 7న మృతి చెందింది. గంగమ్మ కూడా పరిస్థితి విషమించి మంగళవారం కన్ను మూసింది. ఈనేపథ్యంలో గంగమ్మ మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో మండలంలోని బొడ్డవర వరకు తీసుకొచ్చి వదిలేయడంతో బొడ్డవరం నుంచి ఆమె భర్త గంగులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బొడ్డవర రైల్వే స్టేషన్‌ వరకు ద్విచక్ర వాహనం మధ్యలో మృతదేహాన్ని పెట్టి తీసుకువెళ్లాడు. అక్కడినుంచి డోలీపై ఏడు కిలోమీటర్లు గిరి శిఖర చిట్టెంపాడు గ్రామానికి తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించాడు. ఈఘటన స్థానికులను తీవ్రంగా కలిసివేసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. డోలి మోతలపై ప్రజాశక్తి పత్రికలో వచ్చిన కథనాలకు జిల్లా కలెక్టర్‌ స్పందించి రహదారి నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు.

➡️