చినతోలు మండకు బిటి రోడ్డు నిర్మించాలి

Dec 30,2023 21:10

ప్రజాశక్తి – కురుపాం : జియ్యమ్మవలస మండలం అలమండ పంచాయతీ గ్రామానికి వెళ్లే రహదారిని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొల్లి గంగనాయుడు మండల కార్యదర్శి కోరంగి సీతారాం శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జియ్యమ్మ వలస నుండి నిడగళ్లగూడ మీదుగా చినతోలుమండ వరకు సుమారు మూడు కిలోమీటర్లు రోడ్డు రాళ్లు, గోతులు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఇదే సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించలేదన్నారు. బిటి రోడ్డు నిర్మించాలని అనేక ఏళ్లుగా ప్రజాప్రతినిధులను వేడుకున్నా ఈ రోడ్డు వంక చూడలేదన్నారు. మండల కేంద్రాలకు వచ్చిన గిరిజనులు నిత్యవసర సరుకులు, రేషన్‌ బియ్యం, అటవీ ఉత్పత్తులు తలపై పెట్టుకొని మూడు కిలోమీటర్లు కాలినడకన ఎక్కి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గర్భిణీలు, వ్యాధిగ్రస్తులను డోలీలు కట్టి దిగువకు దించుతున్నారని ఇది చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా బిటి రోడ్డు మంజూరు చేసి వెంటనే నిర్మాణం చేపట్టాలని చినతోలు మండ గిరిజనులతో కలిసి నిరసన తెలిపారు. ఒక్క చిన్నతోలు మండే కాకుండా మండలంలో ద్రాక్షని, చాపరాయి గూడ, బాపనగూడ, ఆర్నాడ, బిల్లమానుగూడ, అర్నాడ వలస తుమ్మి గూడ, దంగ భద్రవలస, చిలకల వానివలస, పసుపువాని వలస గిరిజన గ్రామాలకు సరైన రహదారి మార్గాలు లేవని గిరిజన గ్రామాలకు అన్నింటికీ వెంటనే బిటి రోడ్లు మంజూరు చేసి నిర్మాణం చేయాలని డిమాండ్‌ చేస్తూ జనవరి 9న జియ్యమ్మవలస ఎంపిడిఒ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ మండల కార్యదర్శి గోరపాడు సోమయ్య, గిరిజనులు పాల్గొన్నారు.

➡️