చెట్టు చెప్పలేదు.. అడిగే అధికారి లేడు..

Mar 29,2024 23:29

రొంపిచర్ల నుండి నరసరావుపేటకు కలపలోడుతో వెళుతున్న ట్రాక్టర్‌
ప్రజాశక్తి – పల్నాడు జిల్లా :
నన్ను కొడుతున్నారని చెట్టు చెప్పలేదు.. బహిరంగంగానే రవాణా అవుతున్నా అధికారులు పట్టించుకోరు.. వెరసి కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నరసరావుపేట నియోజకవర్గంలో కొంతమంది కలప వ్యాపారులు ధనార్జన కోసం నిబంధనలు మీరుతున్నారు. వాల్టా చట్టంపై గొడ్డలి వేటు వేస్తూ రోడ్ల వెంట, ఎన్‌ఎస్‌పి కాల్వ కట్ట మీద ఉన్న చెట్లను నరికిస్తున్నారు. వాటిని ఇటుక బట్టీలకు, హోటళ్లు, టింబర్‌ డిపోలకు తరలిస్తున్నారు. రోడ్ల వెంట ఉండే పొలాల్లోని తమ పైరుపై చెట్టు నీడ పడుతోందని, పంట సరిగా పండడం లేదని రైతులు ఫిర్యాదు చేస్తే కేవలం కొమ్మల వరకు తొలగించుకోవాలని ఆర్‌ అండ్‌ బి అధికారులు అనుమతిస్తారు. అంతేగాని ఏకంగా చెట్లనే కొట్టేయడానికి వీల్లేదు. అలాంటిది వేప, నల్లతుమ్మ సహా అనేక రకాల భారీ చెట్లను అక్రమార్కులు కొట్టేయిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చెట్లు పెంచేవారు లేకున్నా ఇంత పెద్ద మొత్తంలో కలప ఎలా రవాణా అవుతుందనే అంశంలో అధికారుల ఉదాశీనతే అక్రమార్కులకు కొమ్ములి స్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

➡️