చోరీలతో వ్యాపారులు బెంబేలు

ప్రజాశక్తి-తెనాలి : పోలీసుల నిఘా వైఫల్యమో.. దొంగలు తెలివి మీరిపోయారో తెలియదుకాని మొత్తం మీద తెనాలి పట్టణంలో దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. పది రోజుల వ్యవధిలోనే ఐదు షాపులు, మూడు ఆలయాల్లో చోరీ చేశారు. ఒకే రోజు రాత్రి ఐదు షాపుల్లో జరిగిన చోరీ, పదిరోజుల వ్యవధిలో మూడు ఆలయాల్లో జరిగిన చోరీలు రెండూ అర్ధరాత్రి దాటిన తరువాతే జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన కూడళ్లలోనే వరుస చోరీలపై పట్టణంలోని వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో అర్ధరాత్రి వేళ చడీచప్పుడు లేకుండా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. అది కూడా ప్రధాన కూడళ్ళలో. ఇలా వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పదిరోజుల క్రితం ఐగు షాపుల్లో జరిగిన చోరీ ఘటన మరిచే లోగా పోలీసులను ఆదమరిపించి, మంగళవారం అర్ధరాత్రి దాటాక రజకచెరువు కూడలిలోని ఆంజనేయస్వామి, సాయిబాబాగుడి, రామాలయంలో దొంగలు పడ్డారు. ప్రవేశ ద్వారాల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు హుండీలను పగులగొట్టి అందులో నగదును అపహరించారు. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, సిసిటివి పుటేజి పరిశీలనలో నిమగమయ్యారు. సరిగ్గా పదిరోజుల క్రితం అంటే ఈనెల 13న అర్ధరాత్రి దాటిన తరువాత దొంగలు మార్కెట్‌ కూడలిలోని ఐదు షాపుల తాళాలు పగులగొట్టి నగదును అందిన వరకూ దోచుకున్నారు. మరో రెండు షాపుల షట్టర్లు పగుల గొట్టేందుకు విఫలయత్నం చేశారు. తెల్లవారి వ్యాపారులు వచ్చి షాపుల తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఒన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ షాపు, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు షాపుల్లో దొంగతనం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే వ్యాపార కూడళ్లలో ఒకే దఫా ఐదు షాపుల్లో దొంగతనం జరగటం పట్ల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీమ్‌ను కూడా పిలిపించారు. సిసి టివి పుటేజి పరిశీలనలో ఒకే వ్యక్తి పలుగుతో తాళాలు పగులగొట్టి షాపుల్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. నాలుగు రోజుల క్రితం సోమసుందరపాలెం పంచాయతీ పరిధిలోని ఆటోనగర్‌లో ఇంజన్‌ ఆయిల్‌ విక్రయించే షాపులోనూ దొంగలు పడ్డారు. దాదాపు రూ.లక్ష వరకూ నగదును అపహరించారు.
టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిఘా వైఫల్యమా…
వరుసగా జరిగిన దొంగతనాల్లో పట్టణ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే కావటం గమనార్హం. ఈనెల 13న ఐదు షాపుల్లో చోరీ జరిగితే వాటిలో నాలుగు షాపులు టూటౌన్‌ పరిధిలోవే. మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగిన మూడు ఆలయాలు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనివే. పైగా ఆలయాలు ప్రధాన కూడలిలో ఉన్నవే. ఘటనా స్థలం పోలీస్‌ స్టేషన్‌కు చాలా దగ్గర కూడా. దీంతో రాత్రి వేళ నిఘా వైఫల్యమే చోరీలకు కారణమని ప్రజలంటున్నారు.
దర్యాప్తు జరుగుతోంది…
ఎస్‌.వెంకట్రావ్‌, సిఐ, టూటౌన్‌, తెనాలి.
మార్కెట్‌ కూడలిలో జరిగిన దొంగతనంలో నాలుగు షాపులు మా పరిధిలోనివే. తాజాగా దొంగతనం జరిగిన ఆలయాలు కూడా మా పరిధిలోనివే. రెండు ఘటనల్లోనూ అపహరణకు గురైన నగదు చాలా తక్కువే. ఈనెల 13న జరిగిన చోరీల కేసులో సిసిటివి పుటేజి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. పుటేజిలో దొంగ రైల్వే స్టేషన్‌ రోడ్డు వైపు వెళ్లినట్లు కనిపంచింది. తదుపరి ఎక్కడా పుటేజిలో కనిపించలేదు. దర్యాప్తు చేస్తున్నాం. ఆలయాల్లో చోరీకి సంబందించి అనుమానితులను విచారిస్తున్నాం. రాత్రి వేళ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాం. దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

➡️