జగనన్న మాటే శిరోధార్యం

ప్రజాశక్తి-మార్కాపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాటే తమకు శిరోధార్యమని మార్కా పురం, గిద్దలూరు శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి, అన్నా వెంకటరాంబాబు అన్నారు. వైసిపి అభ్యర్థులు అటుఇటుగా మారిన వేళ మార్కాపురం సమీపంలోని ‘ఏ1 గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల’లో పరిచయ కార్యక్రమం ఆదివారం జరిగింది. వైసిపి మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబును నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ వైసిపికి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు అన్నా వెంకటరాంబాబును పరిచయం చేశారు. వైసిపి అధినేత సిఎం జగన్‌ సమకాలీన రాజకీయ పరిస్థితులు, సామాజిక సమతుల్యతలను దృష్టిలో పెట్టుకొని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహాత్మక అడుగుల్లో భాగంగా మార్కాపురం, గిద్దలూరులో మార్పులు చేశారని అన్నారు. మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు. జగనన్న మళ్లీ సిఎం కావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుంచి అన్నా వెంకటరాంబాబు విజయం కోసం పనిచేయాలని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, వైసిపికి చెందిన ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గంలోని వైసిపి శ్రేణులు పాల్గొన్నారు.

➡️