‘జగన్‌’ను నమ్మినందుకుమోకాళ్ల ‘శిక్ష’

Dec 14,2023 20:59
తిరుపతిలో మోకాళ్లపై నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

‘జగన్‌’ను నమ్మినందుకుమోకాళ్ల ‘శిక్ష’ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం ‘తెలంగాణా కంటే అదనంగా వేతనం ఇస్తామని ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా సిఎం జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. నాలుగున్నరేళ్లయినా స్పందన లేదు.. నమ్మినందుకు మోసపోయాం.. తెలంగాణాలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సిఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఎన్నికల హామీల్లో భాగంగా 11వేల నుంచి 18వేల వరకు జీతాలు పెంచాలని చూస్తోంది.. ఇక్కడేమో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సమ్మెచేస్తుంటే వాలంటీర్ల ద్వారా అంగన్‌వాడీ సెంటర్లను నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది.. ఏదిఏమైనా సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేర్చే వరకూ సమ్మె ఆపేది లేదు’ అంటూ అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు ధ్వజమెత్తారు. సమ్మె మూడో రోజు గురువారం అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఎర్రచీరలతో నిరసన తెలపడంతో శిబిరాలన్నీ ఎర్రబారాయి. జగన్‌ను నమ్మినందుకు మాకు శిక్ష తప్పదంటూ మోకాళ్లపై నిరసన తెలిపారు. బలవంతంగా సెంటర్లు నిర్వహించాలని చూస్తే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని, నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వాలని, వయోపరిమితి పెంచాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె మూడో రోజూ కొనసాగింది. ఎపిసిసి మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి, ఐఎన్‌టియుసి గౌరవాధ్యక్షులు నవీన్‌కుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. తెలంగాణాల్లో ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన హామీని అక్కడి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. సెంటర్ల తాళాలను పగలగొట్టి వాలంటీర్ల ద్వారా నడిపించాలన్న ప్రభుత్వ ఆలోచన దుర్మార్గమన్నారు. యుటిఎఫ్‌ జిల్లా నాయకురాలు ఎ.పద్మజ సంఘీభావం ప్రకటించారు. కెవిబిపురంలో.. టిడిపి నాయకులు డి.ఇలంగోవన్‌రెడ్డి మద్దతు తెలిపారు. అంగన్‌వాడీ మహిళలతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ, వాళ్లకంట కన్నీరు పెట్టించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. సిఐటియు మండల కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు. పిచ్చాటూరులో.. గత 15ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్లో జ్ఞానాన్ని వెలికితీస్తున్న పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం దారుణమన్నారు. నాలుగు మండలాల అంగన్‌వాడీ సమస్యను డాక్టర్‌ హెలెన్‌ ఆధ్వర్యంలో అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని మండల నాయకులు తెలిపారు. శుక్రవారం తనవంతుగా అంగన్‌వాడీ అక్కచెల్లెళ్లు 300 మందికి అన్నదానం చేపడతానని హామీ ఇచ్చారు. గూడూరుటౌన్‌లో.. మోకాళ్లపై నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలకు రైతుసంఘం నాయకులు జోగి శివకుమార్‌, ఎ.ఇంద్రావతి, బివి రమణయ్య, ఎస్‌.సురేష్‌, ఎ.ప్రసాద్‌, బి.చంద్రయ్య, గుర్రం రమణయ్యలు సంఘీభావం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీల అడ్వకేట్‌ మందా మనోహర్‌, అడ్వకేట్‌ భావన, కార్మిక సంఘం సీనియర్‌ నాయకులు పుట్టా శంకరయ్య, సేలం శేఖరాచారి మద్దతు తెలిపారు. శ్రీకాళహస్తిలో… మోకాళ్లపై వినూత్న నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలకు సిఐటియు డివిజన్‌ నాయకులు అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, గంధం మణి, రాపూరు సుబ్రమణ్యం సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీ నాయకులు రేవతి, పుష్ప, సౌజన్య, భారతి పాల్గొన్నారు. రేణిగుంటలో.. పాత ఎంఆర్‌ఒ ఆఫీసు వద్ద అంగన్‌వాడీల సమ్మెకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి మద్దతు తెలిపారు. టిడిపి అధికారంలోకి రాగానే అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మల సమస్య పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి 2 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత తమదన్నారు. టిడిపి మండలాధ్యక్షులు మునిచంద్రరెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి కె.హరినాథ్‌, అధ్యక్షులు నరసింహారెడ్డి, సిపిఎం నాయకులు ఒ.వెంకటరమణ, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి సెల్వరాజ్‌, మహిళా మండలి అధ్యక్షురాలు పూమణి, సంఘమిత్ర కార్యదర్శి లక్ష్మి, ఐద్వా నాయకులు సత్యశ్రీ సంఘీభావం తెలిపారు. కార్యకర్తలు పాండురంగమ్మ, భాగ్యలక్ష్మి, లావణ్య, రాజేశ్వరి, కోకిల, వనజ, పవిత్ర, విమలమ్మ, వసంత, నిర్మల, పుష్ప, ఖాదర్‌ బి పాల్గొన్నారు. నాయుడుపేటలో …ఎర్రచీరలతో ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా నాయకులు శివకవి ముకుంద మాట్లాడుతూ సమ్మె చేస్తుంటే ప్రభుత్వం అణచివేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. తమ ఎర్రచీరలు ప్రభుత్వానికి రెడ్‌లైట్‌ అని అన్నారు. విజయమ్మ, సుకుమారి పాల్గొన్నారు. సూళ్లూరుపేట, కోటల్లోనూ సమ్మె కొనసాగింది. చంద్రగిరిలో..అనివార్య పరిస్థితుల్లో అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నారని, తాళాలు పగలగొట్టాలని చూస్తే ప్రతిఘటిస్తామని అంగన్‌వాడీలు హెచ్చరించారు. వీరికి సిఐటియు జిల్లా నాయకులు జయచంద్ర, బాలాజీ, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి హరిక్రిష్ణ, యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.వాణీశ్రీ పాల్గొని ప్రసంగించారు. టిడిపి నాయకులు పులివర్తినాని సతీమణి సంఘీభావం ప్రకటించారు. ప్రేమ నాగరాజమ్మ, నాగభూషణమ్మ, లీల పాల్గొన్నారు. పుత్తూరు టౌన్‌లో… సిఐటియు నాయకులు ఆర్‌.వెంకటేష్‌, ఎఐటియుసి నాయకులు డి.మహేష్‌ ఆధ్వర్యంలో నల్లచీరలతో మోకాళ్లపై నిరసన తెలిపారు. యూనియన్‌ అధ్యక్షురాలు విజయ కుమారి, ముని కుమారి, హైమావతి, ధనమ్మ, రాధా, అన్నపూర్ణమ్మ, అంబిక, గంగులమ్మ, పద్మజ పాల్గొన్నారు. తిరుపతిలో మోకాళ్లపై నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

➡️