బిందు సేద్యంపై చిగురిస్తున్న ఆశలు

ప్రజాశక్తి-వీరబల్లి గత ప్రభుత్వంలో ఉద్యాన రంగానికి తలుపులు బిగించారు. బిందు సేద్యం పూర్తిగా నిర్లక్ష్యం చేసి వేరుశనగ, కూరగాయలు, పూలు, పండ్ల తోటలు, సాగు చేసే రైతుల నోట్లో దుమ్ము కొట్టారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాన్ని మొదట మూడున్న రెళ్ల పాటు నిలిపివేసి రైతులకు అన్యాయం చేశారు. ఎన్నికలకు ముందు హడావుడిగా పథకాన్ని పునరుద్ధరించినా రాయితీలకు కట్‌ చేసి రైతుల ఉసురు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పథకాన్ని పునరుద్దరిస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. టిడిపి కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో వీరబల్లి రైతులు ఈ పథకాన్ని ఎప్పుడు పునరుద్దరిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగా వీలైనంత త్వరగా కార్యచరణ చేపట్టి మేలు చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టిడిపి ప్రభుత్వం 2014-19 పది ఎకరాలలోపు ఉన్న రైతులకు 90 శాతం రాయితీతో పరికరాలు అందించింది. ఎస్సీ, ఎస్టీలకు, 100 వాతం రాయితీ కల్పించింది. వైసిపి ప్రభుత్వంలో 5 ఎకరాలు దాటిన రైతులకు 70 శాతం మాత్రమే ఇచ్చారు. జగన్‌ నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే వారికి 100 శాతం రాయితీ ఎత్తేశారు. చాలా మంది పరికరాలకు అవసరమైన డిడిలు కట్టలేక భయపడి దరఖాస్తు చేసుకోలేదు. మళ్లీ టిడిపి అధికారంలోకి రావడంతో 90 శాతం రాయితీ అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నారు.అప్పట్లో లక్షలాది మందికి ఉపయోగం బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. డ్రిప్‌ పరికరాలు ఏర్పాటు చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 2014-19 అప్పటి టిడిపి ప్రభుత్వం 90 శాతం రాయితీతో బిందు సేద్యం పరికరాలు అందించింది. మండలాలను ఉద్యాన పంటల హబ్‌గా తీర్చి దిద్దే క్రమంలో మండలాల్లో వందలాది మంది రైతులకు డ్రిప్‌ పరికరాలు పంపిణీ చేశారు. 2019లో వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాన్ని ఆటకెక్కించింది. మూడున్నర ఏళ్ల పాటు పట్టించుకోలేదు. ఎన్నికల ముందు అరకొరగా అందించారు. అవి కూడా నాసిరకం పరికరాలతో చాలామంది రైతులు తిరస్కరించారు. రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్‌రెడ్డి మంత్రి కావడంతో రైతుల్లో ఆశలు మొదలయ్యాయి. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేసి పనులు మొదలు పట్టాలని పలువురు రైతులు కోరుకుంటున్నారు.

➡️